చౌటుప్పల్: తమను గెలిపిస్తే ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి.. అధికారంలో వచ్చి 14 నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. బాధితులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించకపోవడం దారణమని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతీసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరుగనున్న బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత.. మార్గమధ్యలో మునుగోడు నిజయోజకవర్గంలోని చౌటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మమ్మల్ని గెలిపిస్తే ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేస్తాం, మీ గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు.
గెలిచి 14 నెలలు అవుతున్నా ఇంతవరకు వారి సమస్యను పరిష్కరించలేదు. సమస్య పరిష్కారం కోసం బాధితులు ధర్నాలు, నిరసనలు చేపట్టినా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించకపోవడం దారుణం అని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు నిలబడి తక్షణమే ట్రిపుల్ ఆర్ బాధితుల సమస్యను పరిష్కరించాలి. మునుగోడు ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, బాధితుల పక్షాన తాము కొట్లాడుతామని’ ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు.