హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై శుక్రవారం హైదరాబాద్‌కు వస్తున్న ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలకు వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో ఈనెల 17న తెలంగాణ జాగృతి, యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించనున్న రైల్‌రోకో పోస్టర్‌ను గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కవిత ఆవిష్కరించారు.
అనంతరం ఆమె మాట్లాడా రు. కాంగ్రెస్ ఎంపీలుగా ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ పార్లమెంట్లో ఉన్నా.. బీసీ రిజర్వేషన్ల అంశంపై వారెందుకు చర్చకు పెట్టడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు నెలల తరబడి కేంద్రంలో పెండింగ్‌లో ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పట్టదా? దీనిపై ఎందుకు ప్రశ్నించడం లేదో సమాధానం చెప్పి తీరాలని నిలదీశారు.
శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీసీల సమావేశం నిర్వహిస్తామని, ఈనెల 8న ఢిల్లీలో మీడియా సమావేశం పెడుతామని తెలిపారు. బీసీ బిల్లులపై ఈ నెల 8లోపు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి రాజకీయ పార్టీలు తమ మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ హక్కులను కాలరాసే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు సీఎం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి, యూపీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.