హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా లోకాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని మట్టికరిపిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని ఈ నెల 8వ తేదీలోగా మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వడంతోపాటు అన్ని హామీలపై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని సూచించారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో భాగంగా కవిత సోమవారం పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10 వేల పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హామీల అమలుపై మార్చి 8లోగా ప్రకటన చేయకపోతే 10 వేల మంది మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తామని, అన్ని గ్రామాల్లో మహిళలను కూడగట్టి లక్షలాది పోస్టుకార్డులను తయారు చేసి సోనియాగాంధీకి పంపిస్తామని తెలిపారు. మహిళల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని, మహిళలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
మహిళా బిల్లుపై మాట్లాడింది మేమే
సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ర్టానికి చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మహిళా అంశాలపై ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్‌కు పోలిక లేదని విమర్శించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాకు ఒక పెట్రోల్ పంపును ఏర్పాటు చేయిస్తే ఆ జిల్లాలో ఉండే వేల మంది మహిళా సంఘాల సభ్యులకు పెద్దగా లాభం ఉండదని, అందువల్ల మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. యువతులకు సూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలని, ఈ పథకాలన్నింటినీ మార్చి 8న ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
రుణ పరిమితిని పెంచాలి
వడ్డీలేని రుణాల పరిమితిని 20 లక్షల కు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రె స్ నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అభయహస్తం నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల శాతం 20% పెరిగిన విషయాన్ని డీజీపీ వెల్లడించారని, ఆడబిడ్డలకు రక్షణపై ప్రభుత్వం సమీక్షించి ప్రకటన చేయాలన్నారు. అంగన్వాడీ కార్మికుల జీతాలను పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఆరోపించారు.