పెద్దపల్లి, ఏప్రిల్ 23 ( నమస్తే తెలంగాణ ) : కుంభమేళా తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నదని, ఇది యావత్ భారత దేశంలోనే చరిత్రాత్మకం కానున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ పల్లెపల్లె నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి మహా కుంభమేళా తరహాలో విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆమె మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిందని, పెద్దపల్లి జిల్లా బొగ్గు గనులకు నిలయమని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె చేస్తూ తట్టా, చెమ్మాస్ కింద పడేస్తేనే ఢిల్లీకి ఉద్యమ సెగ తగిలిందని గుర్తుచేశారు. 25 ఏండ్లుగా నిలబడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తితో బీఆర్ఎస్ పార్టీ పెనవేసుకున్నదని పేర్కొన్నారు.
ఒకప్పుడు అవహేళన చేసిన వాళ్లకు రక్షణగా గులాబీ జెండా ఉందని, పదేండ్లలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపి, గులాబీ జెండా ఎగిరిందని చెప్పారు. 25 ఏండ్ల చరిత్రను నేడు యావత్ తెలంగాణ గుర్తుచేసుకుంటున్నదని పేర్కొన్నారు. ఏడాదిపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే కుంభమేళా తరహాలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒకరూ వరంగల్ సభకు రావాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో వడగండ్ల వానలు వచ్చినప్పుడు అప్పటి మంత్రులు ఆయా ప్రాంతాల్లో పంటలను పరిశీలించేవారని, ఇకడి పరిస్థితులను కేంద్రానికి వివరించి పెద్ద ఎత్తున పరిహారాన్ని తీసుకువచ్చారని గుర్తుచేశారు. కానీ, ఈ ప్రభుత్వంలో మాత్రం అలా లేదని, రైతులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించేవారే లేరని మండిపడ్డారు. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు.
రైతుల సమస్యలపై ఈ జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అకాల వర్షాలు పడితే నష్టపరిహారం ఇచ్చామని, కాంగ్రెస్ సర్కారు ఎందుకు రైతులను పట్టించుకోదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ‘జై తెలంగాణ’ అనని ముఖ్యమంత్రి, మంత్రులు పాలన సాగించడం ప్రజల దురదృష్టమని పేర్కొన్నారు. గురుకులాలను నాశనం చేసి విద్యార్థుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎకితే.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నేడు 100 మందికి పైగా పిల్లలు పాడెక్కారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, నాయకులు కౌశిక్ హరి, దాసరి ఉష, గంట రాములు, పసుల చరణ్, బండారి శ్రీనివాస్, ఉప్పు రాజ్‌కుమార్, బాలాజీరావు, పెంట రాజేశ్, తగరం శంకర్‌లాల్, బొడ్డు రవీందర్, సంధ్యారెడ్డి, నారాయణదాసు మారుతి తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎవ రజతోత్సవ సభకు సింగరేణి కార్మికులంతా సైన్యంలా క దిలి రావాలని ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవా ధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలో మళ్లీ టీబీజీకేఎస్ జెండా ఎగరేద్దామని కవిత పిలుపునిచ్చారు. యూనియన్‌లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని, యు వతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సింగరేణిలో వచ్చే ఎన్నికల్లో 11 ఏరియాల్లో మళ్లీ టీబీజీకేఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అందుకోసం సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రాం మ్మూ ర్తి, రాకేశ్, కౌశిక హరి, దాసరి ఉష, నూనె కొంరయ్య, పెంట రాజేశ్ పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైనవారికి ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశానికి ముందు నేతలంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.