హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, పీడనపై ‘అగ్నిధార’ను కురిపించిన రుధిరధార దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంసృతిక, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు శనివారం ఆమె లేఖ రాశారు. హైదరాబాద్లోని ఒక ప్రధాన కూడలిలో దాశరథి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించుకోవాలని సూచించారు. దాశరథి జన్మించిన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో స్మృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న దాశరథి గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించాలని ప్రతిపాదించారు. దాశరథి సమగ్ర సాహిత్యాన్ని ప్రభుత్వమే ముద్రించి గ్రంథాలయాల్లో అందరికీ అందుబాటులోకి తేవాలని కోరారు.
ప్రకటనలకే పరిమితం
దాశరథి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం పక్షాన అధికారికంగా సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, కానీ ఆ దిశగా పెద్దగా కార్యక్రమాలు జరిగిన దాఖలాలు లేవని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దాశరథి శత జయంతి సంవత్సరం సందర్భంగా ఏడాది పొడవునా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు విస్తృతంగా జరపాలని, శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున జరపాలని కోరారు. దాశరథిని ఉంచిన నిజామాబాద్ జిల్లా పాత జైలును ఇప్పటికే తాము కొంత నిధులను వెచ్చించామని, దాశరథి స్మారక ప్రాంగణం ఏర్పాటుకు పనులు చేపట్టామని, దాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి అవసరమైన మరమ్మతులు చేసి, మరిన్ని వసతులు కల్పించి ప్రముఖ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
సాహితీమూర్తులకు తగిన సత్కారం
మహాకవి దాశరథి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ తొలి ప్రభుత్వం 2015 నుంచి దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహించటమే కాకుండా దాశరథి సాహితీ పురసారాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సాహితీమూర్తులను సత్కరించి, వారికి రూ.1,01,116 నగదును అందించిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని ఆడిటోరియానికి దాశరథి పేరు పెట్టడంతో పాటు మహాకవి కుటుంబానికి అండగా నిలిచేందుకు వారి కుమారుడికి గత కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందని వివరించారు.
భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా
‘తెలంగాణ విముక్తి పోరులో ప్రజల పక్షాన నిలవడమే కాక అనేక రచనా ప్రక్రియల్లో సాహితీ సృష్టి చేసిన సృజనకారులు దాశరథి. ఈ నేల అస్మితను ఆకాశమంత ఎత్తున నిలిపిన ఆ మహనీయుని శత జయంతి ఉత్సవాలు తెలంగాణ తన మూలాలను నెమరువేసుకునే చారిత్రక సందర్భం. దాశరథి స్ఫూర్తిని ముందుతరాలకు చాటే దిశగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తమరిని సవినయంగా కోరుతున్నాను’ అని మంత్రి జూపల్లికి రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ‘కవిత్వం, నాటికలు, కథలు, యాత్రా చరిత్ర వంటి ప్రక్రియలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మహాకవి దాశరథి. అద్భుతమైన సినిమా పాటల రచయితగా జోతలందుకున్న తెలంగాణ బిడ్డ దాశరథి కృష్ణమాచార్యులు. వారి శత జయంతి తెలంగాణ ప్రజలందరికీ పెద్ద పండుగ. ఈ శత జయంతి సంవత్సరాన్ని ఘనంగా నిర్వహించడం ప్రభుత్వ విద్యుక్త ధర్మం’ అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.