హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘లీడర్’ పేరుతో నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం ఆమె బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ‘లీడర్’ శిక్షణ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఏ రాజకీయ నేపథ్యం లేని వారికి, యువతకు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతున్నదని చెప్పారు.. తెలంగాణ గడ్డ అంటేనే ప్రశ్నించేతత్వం అని పేర్కొన్నారు.
ప్రతి నెలా శిక్షణా తరగతులు
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెలా మూడు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. జూలైలో హైదరాబాద్‌లో ప్రారంభించి.. ఆగస్టు నుంచి జిల్లాల్లో నిర్వహిస్తామని, ఇవి నిరంతరం కొనసాగుతాయని వివరించారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒకరూ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్‌తో 153 అసెంబ్లీ స్థానాలతోపాటు ఎంపీ స్థానాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చిన నేపథ్యంలో రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు 33% మహిళా అభ్యర్థులు తయారుకావాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిందని కవిత గుర్తుచేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.