జగిత్యాల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): జీవోలు, కేసులతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ భయ పెట్టలేరని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. జగిత్యాల రూర ల్ మండలం ధరూర్ శివారులో 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆదివారం ఆమె భూమిపూజ చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉద్యమకాలంలో ప్రజల్లో ఉత్సాహం, ధైర్యం, స్ఫూర్తిని రగిలించి రక్షగా నిలిచిన ఉద్యమ తెలంగాణ తల్లిని కాదని, ఆమె చేతిలో ఉన్న బతుకమ్మను లేకుండా చేసి సీఎం రేవంత్ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సెక్రటేరియట్లో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా స మాజం అంగీకరించే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రె స్ ప్రభుత్వం, సీఎం చేస్తున్న దాడిని గ్రామగ్రామాన ఎండగడుతామని చెప్పారు. ప్రభుత్వ గెజిట్‌ను పట్టించుకోబోమని, 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీరుమని స్పష్టంచేశారు.
‘జగిత్యాలకు రావడానికి పెద్ద కారణమే ఉన్నది. కాంగ్రెస్, సీఎం రేవంత్‌కు తెలంగాణ తల్లి, తెలంగాణ బతుకమ్మ వద్దట.. వాటిని లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నరు. ఈ కుట్రలను ప్రజలకు వివరించి చెప్పేందుకే ఇక్కడికి వచ్చిన’ అని కవిత పేర్కొన్నారు. ‘తెలంగాణ మహిళలకు తల్లి లేకుండా, బతుకమ్మనే లేకుండ చేస్తున్న సీఎం కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హా మీలనైనా అమలు చేస్తున్నాడా అంటే అదీలేదు! మహిళలకు మహాలక్ష్మి పథకం వస్తున్నదా? ఒక్కో ఆడబిడ్డకు నెలకు రూ.2500 వస్తున్నాయా?’ అని ప్రశ్నించారు.
ఒక్కో మహిళకు రేవంత్‌రెడ్డి రూ.30 వేలు బాకీ పడ్డారని చెప్పారు. వృద్ధులకు నెలకు 4 వేల పెన్షన్ ఇస్తున్నాడా? అని నిలదీశారు. వృద్ధులకు నెలకు 2వేల చొప్పున సైతం బాకీ పడ్డాడని, దివ్యాంగులకు నెలకు 6 వేల పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిపై బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు.
జగిత్యాల నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీ సమావేశాలకు ఏ ముఖం పెట్టుకొని పోతా రో ప్రజలకు చెప్పాలని కవిత నిలదీశారు. కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఆయన ప్రజలను వదిలిపెట్టిపోయడని, పార్టీ ఎందుకు మారారని అడిగితే పైస ల కోసం మారానని చెప్తున్నారని, ప్రజలను వదిలి పైసల వెంట పడే వారు ఏనాటికీ నాయకులు కాలేరని చెప్పారు. పార్టీకి కొందరు ఎమ్మెల్యేలు ద్రోహం చేసి పోయినా, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు మాత్రం పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు, భయపడాల్సిన అవసరం లేదని, అందరినీ కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
కస్తూర్భా పాఠశాలల్లోనూ కామన్ డైట్ మెనూను పాటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ అనంతరం జగిత్యాలకు చేరుకున్న ఆమె, కొత్తబస్టాండ్ చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజ లి ఘటించారు. ఆ తర్వాత సారంగాపూర్‌లోని కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్నారు. ఇక్కడ ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోయాయని విమర్శించారు.
ఏడాదిలోనే 49 మంది చిన్నారులు విద్యాసంస్థలో చనిపోవడం బా ధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చి గురుకులాల్లో మెనూ ను మార్చివేసిందని చెప్పారు. కామన్ డైట్ మెనూను రూపొందించడంతో పాటు, వాటికి నిధులు కూడా పెంచిందని తెలిపారు. కస్తూర్బా పాఠశాలలను కామ న్ డైట్ పరిధిలోకి తేకపోవడం సరికాదన్నారు. అంతకు ముందు ధరూర్ శివారులో మహిళలతో కలిసి కవిత ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు.
కార్యక్రమాల అనంతరం కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బీఆర్ఎస్ నాయకుడు సృజన్‌రావు కుటుంబ సభ్యులను మేడిపల్లిలో కవిత పరామర్శించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, బీఆర్ఎస్ యూత్ నాయకుడు దావ సురేశ్, మాజీ జడ్పీటీసీ రమ్మోహన్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ ప్రియాంక ప్రవీణ్, కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, కేసరి బాబు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి కేవలం ఒక్క కేసీఆర్ సృష్టి కాదు. అది సకల జనులు సమ్మిళితంగా రూపొందించుకున్న పవిత్రభావానికి ప్రతిరూపం. తెలంగాణ అంటేనే బతుకమ్మ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను కాపాడుకుంటం.
– ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎన్ని జీవోలు, ఎన్ని గెజిట్లు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ సమాజం భయపడబోదు. ఉద్యమకాలంలో ప్రజల్లో స్ఫూర్తి రగిలించిన తెలంగాణ తల్లి విగ్రహాలను పల్లెపల్లెనా ప్రతిష్ఠిస్తం.
– ఎమ్మెల్సీ కవిత