హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): అన్నింటా విఫలమైన మోదీ సర్కార్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనను విస్మరించి, ప్రత్యర్థి పార్టీల పాలిత రాష్ర్టాలపై కత్తి గట్టడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు.
చెన్నైలో శక్రవారం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘2024 ఎన్నికలు- ఎవరిది విజయం?’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో మోదీ వచ్చే ముందు సీబీఐ, ఈడీలు వస్తాయని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై భావసారూప్యత ఉన్న పార్టీలను బీఆర్ఎస్ ఏకం చేస్తుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే అదానీ వ్యవహారంలో జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఎందుకు వేయడం లేదని కవిత ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన కంపెనీని ఎందుకు రక్షిస్తున్నారో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనే లేదని విమర్శించారు. గత పదేళ్లలో ప్రధానిగా మోదీ ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న బీజేపీ 2024లో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని ఆమె తేల్చి చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి, కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు అమలు చేశామని ప్రధాని మోదీ పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 2014లో ప్రారంభించిన ఈ పథకాన్ని 11 కోట్ల 47 లక్షల మంది రైతులకు వర్తింపజేస్తామని చెప్పి ఈ ఏడాది కేవలం 3.80 కోట్ల మందికే ఇచ్చారని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే 50 వేలకు పైగా రైతులను ఈ పథకం నుంచి తొలగించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు లబ్ధిదారుల సంఖ్యను పెంచుతుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం తగ్గిస్తున్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు తాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పిన మోదీ, రాజ్యసభలో మాత్రం 11 కోట్ల కుటుంబాలకు ఇస్తున్నామని అసత్యాలు చెప్పారని ఉదహరించారు. సాక్షాత్తు ప్రధాని మోదీ అసత్యాలు చెప్పి, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని పేర్కొన్నారు. పార్లమెంటులో గంటన్నర సేపు మాట్లాడిన ప్రధాని మోదీ.. అదానీ కుంభకోణంపై ఎందుకు నోరు విప్పలేదని ఆమె ప్రశ్నించారు.
ప్రధాని మోదీ ఆదేశాలతోనే తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు, ఐదుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల ఇండ్లకు ఈడీ, సీబీఐ అధికారులు వచ్చారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తాను ఏ తప్పూ చేయలేదని, మెజారిటీ ప్రతిపక్ష నాయకులు సైతం ఎలాంటి తప్పులూ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అసత్యాలను, ప్రధాని మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ చేసిన ఎమ్మెల్సీ కవిత ప్రసంగానికి కార్యక్రమంలో పాల్గొన్నవారు హర్షాధ్వానాలతో అభినందనలు తెలిపారు.
తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. చెన్నై పర్యటనలో ఉన్న ఆమె శుక్రవారం ప్రముఖ సినీనటుడు అర్జున్సర్జా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ముందుగా అర్జున్ దంపతులు ఆమెకు ఘనస్వాగతం పలుకగా, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని, సంసృతి, భాష, చరిత్ర, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ ఆలయాన్ని నిర్మించిన అర్జున్‌కు ఆమె అభినందనలు తెలిపారు.