నిజామాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఎక్కడుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. యునైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉన్నదా.. రాష్ట్రపతి వద్దకు పోయిందా? సీఎం రేవంత్‌రెడ్డి జవాబు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ మంగళం పా డిందని అన్నారు. కుల గణన పేరిట బీసీ వర్గాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన 36 ఎంబీసీ కులాలకు మంత్రిత్వశాఖ ఏర్పా టు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఇంతవరకు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు రావాలని, ఇందుకోసం మూడు బిల్లులు పెట్టాలని సూచించారు.
బీసీలకు న్యాయం చేసింది కేసీఆరే..
బీసీలకు పెద్దపీట వేసింది కేసీఆరేనని కవిత గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ బడ్జెట్లో 70 శాతం వరకు బీసీలకే కేటాయించారని చెప్పారు. ఐదుగురు రాజ్యసభ, 8 మంది ఎమ్మెల్సీలు, 58 మంది కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టి బీసీలను గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఏ ముఖ్యమంతి ఉంటే వారి సామాజికవర్గానికి చెందిన వారే వీసీలు అయ్యే వారని, ఏ ఒక్కరూ ఓయూకు బీసీ బిడ్డను వీసీగా చేయలేదని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని ఉద్యమ బాట పడుతున్నామని చెప్పారు.
కులగణనకు వ్యతిరేకంగా మోదీ అఫిడవిట్
బీజేపీ చాలా ఘోరమైనదని కవిత వ్యాఖ్యానించారు. జన గణన, కుల గణన చేయాలని సుప్రీంకోర్టును కొద్దిమంది ఆశ్రయించగా, బీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీ తాము కులగణన చేయబోమని అఫిడవిట్ సమర్పించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కో-కన్వీనర్ శివశంకర్, బాజిరెడ్డి జగన్, సుమిత్రానంద్, అయాచితం శ్రీధర్, నవీనాచారి, సంపత్‌గౌడ్, నరాల సుధాకర్, విజయేందర్, కాసాని వీరేశ్, భాస్కర్ యాదవ్, జుబేర్, నరేశ్, మారయ్య, సాంబారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మాట తప్పితే గ్రామాల్లో తిరగనియ్యం..
బీసీ రిజర్వేషన్ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట తప్పితే గ్రామాల్లో తిరగనిచ్చే ప్రసక్తే లేదని రౌండ్ టేబుల్ సమావేశం ముగింపులో కవిత ప్రకటించారు. తప్పించుకునే పని చేస్తే ఆ రెండు పార్టీలను బీసీ ప్రజలంతా వెంటాడుతారని హెచ్చరించారు. అలవికాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యతగా బీసీ డిక్లరేషన్‌లో పొందుపర్చిన బీసీ విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు.