ధర్పల్లి, జనవరి 30: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అబద్ధాన్ని తీసుకుపోయి అద్దం ముందు పెడితే రేవంత్ రూపం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగులో గురువారం కవిత మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలనలో నిండైన జల కళ, గాదెల నిండా వడ్లతో అన్ని రకాలుగా తెలంగాణ సిరిసంపదలతో విలసిల్లిందని అన్నారు. కానీ కాంగ్రస్ పాలనలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రం అన్నిరకాలుగా వెనుకబడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలతో రాష్ట్రం వందేండ్లు వెనుకకు వెళ్లే పరిస్థితి నెలకొందని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ గాలికి వదిలేసిందని, ప్రజల సమస్యలను పట్టించుకొనే నాథుడే లేడని కవిత దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన పింఛన్ డబ్బులే తప్ప ఒక్క రూపాయి పెంచలేదని అన్నారు. ఆడబిడ్డలకు రూ.2500 గానీ, రైతులకు బోనస్ రూ.500 గానీ, విద్యార్థినులకు స్కూటీలు గానీ ఇవ్వలేదని మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ రెండు రోజుల క్రితం తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలియక హామీలిచ్చామనడం బాధాకరమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తాము చెప్పిన వాళ్లకే పథకాలు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారని, ఈ వైఖరి సరికాదని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎంగా కేసీఆర్ చెప్పేవారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంతా అయోమయం, అవినీతిమయంగా మారిందని విమర్శించారు.
పసుపు పంట మార్కెట్‌కు వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కవిత కోరారు. ఈ మేరకు ఎంపీ అర్వింద్ చొరవ తీసుకోవాలని సూచించారు. కుంభమేళాకు వెళ్లే వారి కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకురావాలని చెప్పారు. ఎల్లారెడ్డి పాఠశాలలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురికావడం బాధాకరమని అన్నారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను నడపడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ పచ్చి అబద్ధాల కోరని, ఆయన గంటకో మాట మారుస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టులపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించినున్నది. ‘నీళ్లు-నిజాలు’ పేరిట జరగనున్న ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు సాగునీటిరంగ నిపుణులు, విశ్రాంత ఇంజినీర్లు, మేధావులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.