హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం కమిషన్ పేరుతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం క్షద్ర రాజకీయాలు కొనసాగిస్తున్నదని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరంపై ఏర్పాటుచేసిన కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నట్టు పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందని, కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ర్టానికి కలిగిన ప్రయోజనాలు, కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టడంతో రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న నష్టం తదితర అంశాలపై ధర్నాలో ముఖ్య వ్యక్తలు మాట్లాడుతారని పేర్కొన్నారు.