పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా భువనగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతున్నట్టు ప్రకటించారు.
సీఎం చెప్పిన పక్షం రోజుల్లోనే ఓ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 71 వేల కోట్ల అంచనా వ్యయంతో మూసీ సుందరీకరణ చేపడుతున్నట్టు చెప్పారు.
జూలై 28నగోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏకంగా లక్షన్నర కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపడుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు.
SEP – 19 రూ.4,100 కోట్ల రుణం కావాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పేరిట ప్రపంచ బ్యాంకుకు నివేదిక.. డిసెంబర్లోనే ప్రాజెక్టు మొదలవుతుందని స్పష్టీకరణ
OCT- 04 మూసీ డీపీఆర్ కోసం మెయిన్‌హార్ట్ కన్సార్షియంకు బాధ్యతలిస్తూ సర్కార్ జీవో జారీ
OCT- 17 డీపీఆర్ సిద్ధం కాలేదని సచివాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
Musi Project | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఏడాదిగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి సర్కారు ఆడుతున్న దాగుడుమూతలు బట్టబయలయ్యాయి. కూల్చివేతలు మొదలు డీపీఆర్.. ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం నివేదిక.. అంచనా వ్యయం నుంచి కన్సల్టెంట్ టెండర్ల దాకా ప్రతి దశలో సర్కారు సాగించిన ‘గుట్టు’ రట్టయింది. తాజాగా శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వమే మూసీ డీపీఆర్‌పై తప్పుడు సమాచారం ఇవ్వడంపై గళమెత్తిన ఎమ్మెల్సీ కవిత, సర్కారు అసలు రంగును బయటపెట్టారు. అసలు డీపీఆర్ తయారే కాలేదని ఇన్ని రోజులూ చెప్పుకొచ్చిన ప్రభు త్వం, ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలోనే డీపీఆర్ సిద్ధమైందని అంగీకరించడం సంచలనం కలిగిస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చీరాగానే మూసీని ఉద్ధరించడానికేనంటూ బిల్డప్ ఇచ్చి ‘సుందరీకరణ ప్రాజెక్టు’ను భుజానికెత్తుకోవడం వెనుక ‘దాల్మే కుచ్ కాలాహై!’ అన్న అనుమానాలకు తాజా పరిణామాలు మరింత బలం చేకూర్చాయి.
వాస్తవానికి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వ పెద్దలు చేసిన అంచనా వ్యయం ప్రకటనలతోనే గందరగోళం.. ముఖ్యంగా సర్కారు దాపరికం వెనక అనుమానాలు మొ దలయ్యాయి. పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి భువనగిరిలో మాట్లాడుతూ రూ.50 వేల కోట్ల అంచనా వ్యయంతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఆపై పక్షం రోజుల్లోనే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ కార్యక్రమంలో రూ.71 వేల కోట్ల అంచనా వ్యయంతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్నట్టు చెప్పారు. ఆపై మే చివర్లో మెయిన్‌హార్ట్ ప్రతినిధుల బృందం మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలిసింది. జూలై 28న గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏకం గా లక్షన్నర కోట్ల అంచనా వ్యయంతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపడుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయంతో మొదలైన గందరగోళం అసెంబ్లీలోనూ కొనసాగింది. ఏకంగా అసెంబ్లీ వేదికగానే తలోమాట మాట్లాడటం తెలంగాణ ప్రజలను నివ్వెరపరిచింది. ఈ ఏడాది జూలై నెలాఖరులో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూసీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధంగా ఉన్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తి, ప్రభుత్వాన్ని నిలదీశారు. లక్షన్నర కోట్ల అంచనా వ్యయంతో ఏం చేయబోతున్నారంటూ ప్రశ్నించారు. ఇవే సమావేశాల్లో ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మం త్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ డీపీఆర్ సిద్ధం కాలేదని, ప్రాథమిక దశలోనే ఉన్నదని దశలవారీగా నిధులు వెచ్చిస్తామని సెలవిచ్చారు.
మూసీ డీపీఆర్‌ను రూపొందించేందుకు టెండర్లను ఎంఆర్డీసీఎల్ జూన్ మొదటి వారంలో పిలిచింది. అదే నెల 24న బిడ్ల దాఖలు గడువు పూర్తయింది. జూలై 5న ప్రైస్ బిడ్లను తెరవగా ఎల్-1గా సాయి కన్సల్టెన్సీ ఎంపికైంది. కానీ ఎంఆర్డీసీఎల్ అధికారులు దీన్ని అధికారికంగా ప్రకటించలేదు. జూలై 7న ప్రజాభవన్‌లో తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన 2024, జూలై 20న జీవో ఆర్టీ నంబర్ 325ని జారీ చేసి కన్సల్టెన్సీ టెండర్ల పరిశీలనకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సాయి కన్సల్టెన్సీకి ఎంపికైన టెండర్లను రద్దుచేసి, కొత్త టెండర్లు పిలిచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రెండోసారి టెండర్లు పిలిచి రోజు ల్లోనే మెయిన్‌హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు మూసీ మాస్టర్‌ప్లాన్ బాధ్యతల అప్పగింతకు నిర్ణయించింది. ఆపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 4న రూ.161 కోట్ల వ్యయంతో మెయిన్‌హార్ట్ కన్సార్షియంకు బాధ్యతలు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. మరునాడే ఆ కన్సార్షియంకు ఎంఆర్డీసీఎల్ అంగీకార పత్రం ఇచ్చారు.
ఇక్కడో విచిత్రమైన విషయం ఏందంటే మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ బాధ్యతల అప్పగింతపై టెండర్లు కొనసాగుతున్న సమయంలోనే రేవంత్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక (పీపీఆర్)ను ఇవ్వడం గమనార్హం. కన్సల్టెన్సీని ఎంపిక చేయకముందే సెప్టెంబరు 19న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పేరిట ఈ నివేదికను ప్రపంచ బ్యాంకుకు పంపారు. అందులో డిసెంబరులోనే ఈ ప్రాజెక్టు మొదలవుతుందని, ఈ మేరకు రూ.4100 కోట్ల రుణం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1,763 కోట్లు జత చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా 20వ కాలంలో మూసీ ప్రాజెక్టుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఉన్నది అని ప్రభుత్వమే అంగీకరించింది. ఓవైపు టెండర్లు కొనసాగుతుండగా మరోవైపు డీపీఆర్ ఉన్నదని ప్రభుత్వం పీపీఆర్లో పొందుపరచడమంటే ప్రపంచబ్యాంకుకు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన పీపీఆర్లో మూసీ డీపీఆర్ ఉన్నదని ప్రభుత్వం అంగీకరించగా ఆ తర్వాత అక్టోబర్ 17న సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయం ప్రెస్మీట్లో డీపీఆర్ సిద్ధం కాలేదని ప్రకటించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల వ్యవధిలోనే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై గురి పెట్టింది. జనవరిలోనే సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌లో పర్యటించారు. థేమ్స్ నది ఒడ్డున పర్యటించి మూసీని కూడా ఇలా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఫిబ్రవరి 2న చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ రూపకర్త ఈశ్వరన్‌కు చెం దిన సింగపూర్ కన్సల్టెన్సీ ‘మెయిన్‌హార్ట్’ ప్రతినిధి బృందం సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో కలిసింది. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టుపై చర్చ జరిగింది.