MLC Jeevan Reddy | జగిత్యాల, ఫిబ్రవరి 11: ‘కాంగ్రెస్ సర్కా రు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పించాం. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీం అమలు చేస్తాం. వచ్చే నెల నుంచి ఎవరూ కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు’ అని పట్టభద్రుల ఎమ్మె ల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ జగిత్యాల జిల్లా ఫిషర్ సెల్ అధ్యక్షుడు తోపారపు రజనీకాంత్ అధ్యక్షతన ఆదివారం జిల్లా గంగపుత్ర మహాసభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. గంగపుత్రుల హక్కులు కాపాడుతామని, రోళ్లవాగు తెగిపోవడంతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందిస్తానని చెప్పారు.
గంగపుత్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కుల సంఘం భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చితే గంగపుత్రుల హకులకు భంగం కలుగుతుందనే అపోహ ఉందని, కానీ ఎవరికీ ఇబ్బందులు రాకుండా తాను బాధ్యత తీసుకుంటానని భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి బస్సు ల్లో ఫ్రీ జర్నీ స్కీం అమలు చేస్తున్నదని, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందిస్తామని, వచ్చే నెల నుంచి 200 యూనిట్ల వరకు ఎవరూ కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి 50 ఏండ్లకే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఫిషర్ సెల్ అధ్యక్షుడు మిట్ట సాయికుమార్, గిరినాగభూషణం తదితరులు పాల్గొన్నారు.