హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ): ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రెండవ కూతురు తేజస్వి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అమెరికాలో స్థిరపడిన కేరళ రాష్ట్రం ఎర్నాకులం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చిత్రేను మంగళవారం అమెరికాలోని టెక్సాస్‌లో అతికొద్ది కుటుంబ సభ్యుల సమక్షంలో తేజస్వి వివాహమాడారు. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వీరు.. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి కొడుకు చిత్రే తండ్రి జాన్ హెడీ అభ్యుదయ ప్రగతిశీల సాహితీకారుడు. ఈనేపథ్యంలోనే గోరటి వెంకన్న వారి వివాహానికి అంగీకరించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి ఫొటోలను గోరటి వెంకన్న సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు.