హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారని, ఓటర్లకు నగదు పంపిణీ మొదలుపెట్టినట్టు టీఎస్ యూటీఎఫ్ ఆరోపించింది. ఒక అభ్యర్థి పక్షాన కొందరు వ్యక్తులకు రూ. 2 వేలు ఫోన్ పే ద్వారా పంపించి, పూలు అని మెసేజ్ పెట్టారని రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రముఖ సంఘం పక్షాన భద్రాద్రి కొత్తగూడెంలో వెయ్యి, ఖమ్మంలో రెండు వేలు, మహబూబాబాద్ జిల్లాలో ఐదువేలు పంపిణీ చేసినట్టు సమాచారం ఉన్నదన్నారు. అధికార పార్టీ ప్రతినిధి అని చెప్పుకునే వ్యక్తి రెండువేల చొప్పున పంపిణీచేశారని ఆరోపించారు. ఈ తాయిలాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిచేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. 9, 10వ తరగతుల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా మంగళవారం ఉత్తర్వులిచ్చారు.