హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ‘ప్రజాశక్తినే ప్రదర్శించిన బహిరంగ సభల చేతనం’ అని బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఎమ్మెల్సీ, కవిగాయకుడు దేశపతి శ్రీనివాస్ రాసిన పాట ఆదివారం ఎల్కతుర్తి సభలో మారుమోగింది. ‘చరిత్ర కడుపున పుట్టిందీ ఉద్యమాగ్ని శిశువూ.. అది తెలంగాణ తలరాతను మార్చిన నవవసంత రుతువూ’ అని ఈ పాట మొదలవుతుంది. ఆ పాటకు అనుగుణమైన దృశ్యాలు తెలంగాణ ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని కండ్లముందు ఉంచింది. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచీ పార్టీ అధినేత కేసీఆర్ వెన్నంటే నిలిచిన దేశపతి.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వికాసాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి పరుగుల చరిత్రను ఆ పాటలో దృశ్యమానం చేశారు. రజతోత్సవ వేదికకు కేసీఆర్ వచ్చేముందు ప్రదర్శితమైన ఆ పాట, పాట నేపథ్యంగా ఉద్యమ దృశ్యాలు సభికులను ఒకింత భావోద్వేగానికి లోనుచేశాయి. వీడియో ప్రదర్శన పూర్తికాగానే సభా ప్రాంగణం అంతా ‘జై బీఆర్ఎస్.. జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఒక్కసారిగా పిడికెళ్లెత్తి పలకడం విశేషం.
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తేతెలంగాణ): ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చారని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నారనే విషయం రుజువైందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం తొణికిసలాడుతున్నదని తెలిపారు. 14 ఏండ్లు ఉద్యమం, పదేండ్లు అధికారం, ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్ష పాత్రలో ప్రజలకు అందించిన సేవలకు లభించిన ప్రతిఫలంగానే జనం ఈ సభకు తరలివచ్చారని అభివర్ణించారు. పెద్దసంఖ్యలో తరలివెళ్లిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, విజయవంతానికి కృషి చేసిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.