హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అధికార మత్తులో తూగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. అగ్నిప్రమాదంలో అమాయకులు సజీవదహనమైనా, ఎందరో క్షతగాత్రులుగా మిగిలినా సీఎంకు ఏమీ పట్టడం లేదని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఢిల్లీ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఫోన్ చేసి, జరిగిన ప్రమాదంపై ప్రభుత్వ చర్యల గురించి ఆరా తీస్తే.. హైదరాబాద్‌లోనే ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఒక్క అడుగు బయటపెట్టి బాధితులను పరామర్శించడానికి ఘటనా స్థలానికి వెళ్లలేదని, అందాల పోటీలని తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ర్టానికి కావాల్సింది గ్లామర్ సీఎం కాదని, గుండె ఉన్న సీఎం కావాలన్నారు.
ఘటనా స్థలానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లకపోవడాన్ని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పే బాధ్యతను రేవంత్‌రెడ్డి మరిచారని విమర్శించారు. ముఖ్యమంత్రికి అందాల పోటీలు, విహారయాత్రలు, ఫొటోషూట్లు తప్ప ప్రజల ప్రాణాలు పట్టవా? అని మండిపడ్డారు. ఎక్కడో ఉన్న ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, పక్కరాష్ర్టాల మంత్రులు స్పందిస్తున్నా, సీఎంకు ఈ ఘటన చాలా చిన్నగా కనిపించడం సిగ్గుచేటన్నారు.