హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను పెట్టుబడిదారులకు కట్టబెట్టడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల కమిటీని అడ్డంపెట్టుకొని ఎకోపార్క్ ముసుగులో కొత్త డ్రామాలకు తెరతీశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్ విమర్శించారు. హెచ్‌సీయూపై కత్తిగట్టే కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. కంచ గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు, చెట్లు లేవంటూ నిస్సిగ్గుగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతీకార, మోసపూరిత ఆలోచనలతో నీచమైన ఆట ఆడుతున్నారని నిప్పులుచెరిగారు. విద్యార్థులు, పర్యావరణవేత్తల తీవ్ర నిరసనలు… సుప్రీంకోర్టు ఆదేశాలతో యూటర్న్ తీసుకొని 2,000 ఎకరాల్లో ఎకోపార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ పాలన తెలంగాణకు శాపంగా మారిందని మండిపడ్డారు.