హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి యూనివర్సిటీ భూ ములు అమ్మేందుకు యత్నించడం దు ర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. వేల ఎకరాలను హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగా రేవంత్రెడ్డి వ్యక్తిగతంగా లైసెన్స్ దోపిడీకి దిగుతున్నారని ఆరోపించారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాల భూమిని దండుకునేందుకు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాలా ప్రవర్తిస్తున్నదని దుయ్యబట్టారు.
ఐఎస్బీ భూములకు కూడా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం ఉన్నదని పేర్కొన్నారు. వర్సిటీ భూములు అమ్మే వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగడం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని మంత్రివర్గంలో చర్చించారా? లేక సీఎం తాను రాష్ర్టానికి తోటమాలి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఇది విద్యా వ్యవస్థపై నేరుగా దాడి చేయడమేనని మండిపడ్డారు.
ముస్లింల గురించి గొప్పగా చెప్పుకొనే కాంగ్రెస్.. ఉర్దూ భాష, ఉర్దూ విద్యార్థుల సమస్యలపై ఎందుకు మౌనంగా ఉందని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ముస్లిం సమాజమంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఉర్దూ వర్సిటీకి జారీ చేసిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు. సీఎం, మంత్రులు ఇకనైనా రియల్ ఎస్టేట్ దందాలు మానుకోవాలని హితవు పలికారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో విద్యార్థుల కు అండగా నిలిచినట్టే, ఉర్దూ విశ్వవిద్యాలయ భూముల రక్షణలోనూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.