హైదరాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : నాదర్గుల్ భూముల అంశం ఓ వైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే ఫెన్సింగ్ ఎలా వేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. 1974 ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం ప్రకారం ఆ భూమి ప్రభుత్వానిదేనని, కానీ అక్రమంగా దోపిడీదారుల చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ భూమిని టీజీఐఐసీకి కేటాయించిందని గుర్తుచేశారు. హైకోర్టు కూడా 2020లో ఇచ్చిన తీర్పులో ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా పేరొన్నదని తెలిపారు. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ హైకోర్టు తీర్పు అమల్లోనే ఉన్నదని, అయినా కూడా నకిలీ పత్రాలతో తమదని చూపుతూ కంచెలు వేసి నిర్మాణాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గమైన రీతిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతున్నదని శ్రవణ్‌కుమార్ విమర్శించారు.
అందుకు బీఆర్ఎల్సీ ఉప నేత హరీశ్‌రావు, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు అరెస్టులే నిదర్శనమని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే హరీశ్‌రావు ఎకడ ఉంటే అకడికి వేలాది మంది కార్యకర్తలు చేరుకొని ముట్టడిస్తారని హెచ్చరించారు. గతంలో దొంగలు, దోపిడీదారులను చూశామని, ఇప్పుడు ప్రభుత్వం ముసుగులో రియల్ ఎస్టేట్ మాఫియా, భూదొంగలు తయారయ్యారని ఆయన విమర్శించారు. ఖాళీ స్థలం కనిపిస్తే గద్దల్లా వాలి, నకిలీ పత్రాలతో అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. కోర్టు తీర్పులను కూడా లెకచేయకుండా భూ దోపిడీకి తెగబడుతున్నారని శ్రవణ్ తూర్పారపట్టారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి ఈ దోపిడీకి సహకరించడం దారుణమని మండిపడ్డారు. మానసాహిల్స్, వట్టినాగులపల్లి, నాదర్గుల్ వంటి ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువైన భూదోపిడీ జరుగుతున్నదని ఆరోపించారు. ప్రజలను బెదిరించి, రైతులపై దాడులు చేసి భూములను లాకొంటున్నారని, ఈ దోపిడీ ద్వారా వచ్చిన డబ్బులను ఇతర రాష్ర్టాల ఎన్నికలకు పంపుతున్నారని శ్రవణ్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని భూ కబ్జాదారులపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ధర్మయుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఒక మంత్రి తప్పు చేస్తే ముఖ్యమంత్రి సమర్థించడం, మిగతా మంత్రులు మౌనం వహించడం అనుమానాస్పదంగా ఉన్నదని శ్రవణ్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు ఎందుకు స్పందించడం లేదన ఆయన సూటిగా ప్రశ్నించారు. అధికారులకు కూడా ఈ దోపిడీలో భాగమున్ననట్టు ఆనుమానాలున్నాయని, ఎవరూ మినహాయింపు కాదని అందరూ క్రిమినల్ విచారణ ఎదురోవాల్సిందేనని హెచ్చరించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద మంత్రితో పాటు సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూ ఆక్రమణల ప్రభుత్వమని.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి కూడబలుక్కొని లక్షల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. చర్చకు తాము సిద్ధమని.. మంత్రి పొంగులేటి డాక్యుమెంట్లతో రావాలని సవాల్ చేశారు. ఒక ముఖ్యమంత్రే హోం శాఖను తన వద్ద ఉంచుకోవడం గతంలో ఎన్నడూ లేదని విమర్శించారు. ఏక్యూ స్క్వేర్ మనుషులు.. నాదర్గుల్ భూముల వ్యవహారంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలారని ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులేటి, వారి కుటుంబ సభ్యులు న్యాయంగా సంపాదించుకుంటే అభ్యంతరం లేదని, గత కాంగ్రెస్ హయాంలోనే వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్టును ఎవరు ఉల్లంఘించినా ఏ కోర్టూ రెస్క్యూకి రాదని పేర్కొన్నారు. నాదర్గుల్ భూములపై సుమోటోగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. ఈ డబ్బులతో నిరుద్యోగులకు ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. సమావేశంలో అభిలాష్ రంగినేని, కల్వకుర్తి శ్రీనివాస యాదవ్, నరసింహాగౌడ్ పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏడో గ్యారంటీ అని చెప్పిన కాంగ్రెస్ నేడు ప్రశ్నించే గొంతులపై కత్తి కడుతున్నదని బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పరిగి రైతులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న హరీశ్‌రావును అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజాపాలన ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన నడుపుతున్నదని విరుచుకుపడ్డారు. ఉగ్గు పాలతోనే ఉద్యమాన్ని పుణికి పుచ్చుకున్న బీఆర్ఎస్కు నిర్భంధాలు కొత్త కాదని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎగ్గొట్టిన హస్తం పార్టీని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.