హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీయిజం, గూండా యిజం రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ దేవీప్రసాద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను తాబేదార్లుగా మార్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఇప్పటివరకు 5వేల కేసులు పెట్టారని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదని, అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుముల రాజ్యాంగం అని దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో మెదక్ ఎమ్మెల్యే పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు హేయమని, రాష్ట్రంలో పోలీసుల స్థాయిని సీఎం రేవంత్‌రెడ్డి దిగజార్చారని ఆయన దుయ్యబట్టారు. శాంతి భద్రతల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి, తన క్యాబినెట్ మంత్రులతో పాటు అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు చట్టపరంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు.
రాష్ట్రంలో క్రైమ్ రేటు 43 శాతం, లైంగికదాడులు 28.9 శాతం పెరిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సగటున రోజుకు 8 లైంగికదాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో క్రైమ్ రేటు 41 శాతం వరకు పెరిగిందని తెలిపారు. ఒక టీవీ చానల్‌పై దాడి కేసులో బీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు అతడి భార్యపైనా కేసులు పెట్టడం.. రేవంత్‌రెడ్డి నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో గన్‌కల్చర్ పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. రీట్వీట్ చేసినా అరెస్ట్ చేయడం హేయమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన నడుస్తున్నదని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న వారిపై లాఠీలతో విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా, తమ పోరాటం మాత్రం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.