హైదరాబాద్ మే 23 (నమస్తే తెలంగాణ) : ‘నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో ఈడీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును చేర్చినా.. ఆయన ఇంకా కుర్చీని పట్టుకొని వేలాడటం సిగ్గుచేటు.. ఇది యావత్ తెలంగాణ జాతికి అవమానకరం.. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. పీసీసీ పదవిని అడ్డంపెట్టుకొని మొదలుపెట్టిన ఆయన అవినీతి వ్యవహారం.. ఇప్పుడు సీఎం హోదాలో రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయస్థాయికి చేరిందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో దేశవ్యాప్తంగా అభివృద్ధిపై చర్చ జరిగేదని, కానీ 18 నెలల కాంగ్రెస్ పాలనలో అవినీతిపై చర్చ జరిగే దుస్థితి రావడం బాధాకరమని అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని జీడీపీ, తలసరి ఆదాయం, సాగునీరు లభ్యత, పంటల ఉత్పత్తి రంగాల్లో తలమానికంగా నిలిపారని, రేవంత్ మాత్రం అక్రమాలు, దోపిడీలు, దుర్మార్గాలతో తలవంపులు తెస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు వాసుదేవారెడ్డి, కురువ విజయ్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అవినీతిపరుడన్నది జగమెరిగిన సత్యమని అన్నారు. ఓటుకు నోటు దొంగ ఎవరంటే చిన్నపిల్లాడిని అడిగినా ఆయన పేరే చెప్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని రూ.50 కోట్లకు కొనుక్కున్నాడని ప్రస్తుతం ఆయన దగ్గర పనిచేస్తున్న మంత్రి కోమటిరెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత హన్మంతరావు ఆరోపించారని గుర్తుచేశారు. ‘పీసీసీ అధ్యక్షుడయ్యాక ఆయన అక్రమాల పర్వం జూలువిదిల్చింది.. ఇక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత పరాకాష్టకు చేరింది’ అని ఆరోపించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన అన్నిరంగాల్లో అవినీతే రాజ్యమేలుతున్నదని చెప్పారు. 30 శాతం కమీషన్లు ముట్టనిదే పనులు కావడం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, కమీషన్లు తీసుకోనిదే మంత్రులు ఫైళ్లు ముట్టరని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని ఉదహరించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్లో పేరు నమోదైనా సీఎం రేవంత్ తేలుకుట్టినా దొంగల వ్యవహరిస్తున్నారని శ్రవణ్ వ్యాఖ్యానించారు. రేవంత్ మౌనం వహిస్తున్నారంటేనే తప్పును అంగీకరించినట్లేనని స్పష్టంచేశారు. అవినీతి ఆరోపణలు వచ్చిన రేవంత్‌రెడ్డి నిర్లజ్జగా పదవిలో కొనసాగితే అనేక అనర్థాలు తలెత్తే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమార్కుడైన ముఖ్యమంత్రి దారిలో మంత్రులు, ఉన్నతాధికారులు నడిస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వస్తదని చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌కు రాసినట్టు చెప్తున్న లేఖపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శ్రవణ్ పేర్కొన్నారు. ఒకవేళ ఆ లేఖ నిజమేనని అనుకున్నా అందులో ప్రస్తావించిన విషయాలు గతంలో చర్చలో ఉన్నవేనని చెప్పారు. ఈ లేఖతో రాజకీయాల్లో వచ్చే మార్పేమీ ఉండబోదని తేలికగా కొట్టిపారేశారు. కానీ కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని తప్పుడు ప్రచారం చేస్తు న్నాయని ఆక్షేపించారు. కేసీఆర్‌కు తన బిడ్డ రాసిన లెటర్లో అభ్యంతరకర విషయాలేమీలేవని, కొన్ని సరిదిద్దుకోవాల్సిన అంశాలుంటే పార్టీలో చర్చించి సరిచే స్తారని స్పష్టంచేశారు. దీనికి మీడియాలో అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
‘కేసీఆర్, బీఆర్ఎస్పై నిత్యం ఎగిరెగిరి పడే బీజేపీ నాయకులు నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్‌రెడ్డి పేరువచ్చినా ఎందుకు స్పందించడంలేదు? ఇదే కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు వస్తే అక్కడి బీజేపీ నాయకులు గగ్గోలు పెడుతుంటే.. ఇక్కడి ఆ పార్టీ నాయకులు మౌనం వహిస్తున్నరెందుకు? లోపాయికారి ఒప్పందంతోనే పెదవులు మూసుకున్నారా?’ అంటూ శ్రవణ్ సూటిగా ప్రశ్నించారు. నిత్యం బీఆర్ఎస్పై అగ్గిరాజేసే బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఎక్కడికి పోయారని నిలదీశారు. నిజంగా బీజేపీ పెద్దలకు చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.