HCU | రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి విధ్వంసం చేస్తున్నాడని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీఆర్ఎస్వీ, హెచ్‌సీయూ విద్యార్థులతో కలిసి ఎమ్మెల్సీ కలిశారు. భూములను కాపాడాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్రమంత్రిని కలిశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. మానవత్వం లేకుండా కర్కషత్వంతో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను విధ్వంసం చేస్తున్నారని.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం యూనివర్సిటీని విధ్వంసం చేస్తున్నారన్నారు.
భూములను కాపాడుతామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని.. భారత జాతీయ పక్షి నెమళ్లు కాపాడాలని ఘోషిస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టులో హెచ్‌సీయూ భూములు గెలవగానే.. వాటిని తాకట్టుపెట్టి రూ.20వేలకోట్ల అప్పు తెచ్చారని.. శత్రుదేశాలపై యుద్ధం చేసినట్లు హెచ్‌సీయూపై సీఎం, రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ నీచంగా వ్యవహరిస్తున్నారని.. ఒక జింకను చంపితే ఐదేళ్ల శిక్ష సల్మాన్ ఖాన్‌కు పడితే.. వందల నెమళ్లు.. జింకలను చంపుతున్న రేవంత్‌రెడ్డికి ఎన్నేళ్ల శిక్ష పడాలని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని.. యూనివర్సిటీ విధ్వంసంపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రాజ్యంలో నోరులేని మృగాలు, పేదలు బతకొద్దా? అంటూ నిలదీశారు.