హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి ఆటోడెబిట్ విధానంతో నేరుగా డబ్బు వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన చట్టవిరుద్ధం. ఈ విధానం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల బ్యాంక్ ఖాతా నుంచి ఆటోడెబిట్ విధానంతో ప్రజల సొమ్మును కాజేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడమే కాకుండా, సామాన్య ప్రజల మౌలిక హక్కులపై దాడి చేయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ఆర్టికల్ 21-జీవనహక్కు, ఆర్టికల్-300ఏ ఆస్తిహక్కును ఉల్లంఘించేలా ఉన్నదని పేర్కొన్నారు.
ప్రజల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు, వారి వ్యక్తిగత ఆస్తి అని, కోర్టు ఆదేశం, చట్టబద్ధ అధికారం లేకుండా ప్రభుత్వం ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. ఆటోడెబిట్ విధానం అమల్లోకి వచ్చినట్టయితే ఖాతాదారులకు బ్యాంక్‌లపై నమ్మకం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. మోటర్ వాహనాల చట్టం సెక్షన్-200 ప్రకారం చలాన్లు చెల్లించాలా? లేదా కోర్టుకు వెళ్లాలా? అన్నది ఎంపిక చేసుకునే హక్కు పూర్తిగా పౌరుడికే ఉంటుందని తెలిపారు. ప్రజల సంపదను కాపాడాల్సిన ప్రభుత్వమే డబ్బులు వసూలుచేసే యంత్రాంగంగా మారకూడదని, ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ పోరాడుతుందని దాసోజు తెలిపారు.