Telangana | హైదరాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతు పనుల కోసం ఆర్అండ్బీ శాఖకు ఎమ్మెల్యేల నుంచి భారీగా వినతులు వస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి రూ.50 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర ఖర్చయ్యే పనుల కోసం వినతులు అందినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఆయా పనుల మొత్తం విలువ రూ.15,000 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. రాష్ట్రంలో ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల కోడ్ మొదలైనప్పటినుంచి రోడ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పూర్తయిన రోడ్లకు బిల్లులు చెల్లించకపోగా, కొత్త పనులను మంజూరు చేయడం లేదు. దాదాపు రూ.1,000 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో అనేక నియోజకవర్గాల్లో కొత్త రోడ్లు, కల్వర్టుల నిర్మాణం కోసం ఎమ్మెల్యేల నుంచి భారీగా వినతులు వస్తున్నాయి. నిత్యం ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఇటు ఆర్అండ్బీ కార్యాలయానికి, అటు సచివాలయంలోని మంత్రి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి ఎక్కువగా ప్రతిపాదనలొచ్చాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎక్కువగా నష్టపోయిన జిల్లాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు కోరుతున్నారు. దీంతో ఒక్కో నియోజకవర్గానికి రూ.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సుమారు 2,553 కిలోమీటర్ల మేర రోడ్లు, 902 హైలెవల్ వంతెనలు, 391 కల్వర్టులు, 166 వంతెనలు దెబ్బతిన్నట్టు రోడ్లు, భవనాల శాఖ అధికారులు గుర్తించారు. తాత్కాలిక పనులకు రూ.100 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.2,462 కోట్లు కావాలని ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదించగా, ప్రభుత్వం రూ.15 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇవి కనీసం తాత్కాలిక మరమ్మతులకు కూడా సరిపోలేదు. కాగా, ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రోడ్లకు భారీగానే నిధులు కేటాయించినప్పటికీ, విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. బడ్జెట్లో ప్లాన్ నిధుల కింద రూ. 518 కోట్లు, నాన్ ప్లాన్ కింద రూ.888 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా స్పిల్ఓవర్ నిధులు కూడా భారీగానే బడ్జెట్లో చూపించారు. కాగా, రోడ్లకు ఇంత భారీ నష్టం జరిగినా నిధులు విడుదల చేయలేదు.