హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోతుల బెడదను ప్రస్తావించారు. కోతులు టమాట, మక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయని, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని వివరించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి, మిషన్‌మోడ్‌లో నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): శాసనసభ, మండలి ఇటీవల మృతిచెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు మాధవరం జగపతిరావు, అహ్మద్‌పీర్ షబ్బీర్ మృతికి ఉభయ సభల సభ్యులు నివాళులర్పించారు.
తొలిరోజున శాసనసభలో ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. జీహెచ్ఎంసీ వార్డుల పెంపు, టీజీపీఎస్సీ ఉద్యోగుల రేషనలైజేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, తెలంగాణ జీఎస్టీ చట్టాలను సవరణ ఆర్డినెన్స్ బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ సమగ్రశిక్షా అభియాన్, పీఎంశ్రీ స్కీమ్‌ల ఆడిట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక నివేదికలను సభకు సమర్పించింది.