హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే నోటికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకునేందుకు వారు పడుతున్న ఆపసోపాలు చూసి జనం విస్తుపోతున్నారు. నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి వేలాడుతున్న చట్టం కత్తి నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఏడాదిన్నరగా తెలంగాణ భవన్ తొక్కని, మెడలో గులాబీ కండువా వేసుకోని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉ న్నామని బొంకుతున్నారు. కోర్టులను బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. వీరి కుయుక్తలను ముందే పసిగట్టిన బీఆర్ఎస్ సాక్ష్యాధారాలను సుప్రీంకోర్టు ముందుంచింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తప్పేలా కనిపించడం లేదు. అదే జరిగితే ఉప ఎన్నికలూ తప్పవు. ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, నేతలకు కర్రుకాల్చి ఎప్పుడు వాత పెడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తామింకా బీఆర్ఎస్లోనే ఉన్నామని కూనిరాగాలు తీస్తున్నారు.
పదిమంది మాతోనే: మంత్రి కోమటిరెడ్డి
రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో నిండు శాసనసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఇప్పుడు వారికి ఉన్నది 28 మందేనని, పదిమంది తమవైపు వచ్చేశారని, ఇంకా వస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. అన్ని పత్రికల్లోనూ ఈ వార్త వచ్చింది.
అప్పుడో మాట.. ఇప్పుడో మాట
ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా స్వయంగా తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు చెప్పారు. రాష్ర్టాభివృద్ధి, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు పేర్కొన్నారు. అధికారిక వేదికలను కూడా కాంగ్రెస్‌తోనే పంచుకున్నారు. పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశానికి వారు ఏనాడూ హాజరు కాలేదు. పార్టీ సభలు, సమావేశాల్లోనూ పాల్గొనలేదు. పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాలకు హాజరయ్యారు. వీరు పార్టీ మారకుంటే సీఎల్పీకి ఎందుకు వెళ్లినట్టు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
సొంత నియోజకవర్గాల్లో కుంపట్లు!
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లోని అసలు కాంగ్రెస్ నేతలతో పొసగడం లేదు. జగిత్యాల ఫిరాయింపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను చేర్చుకోవద్దంటూ మాజీమంత్రి టీ జీవన్‌రెడ్డి ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పారు. అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారు. కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని గద్వాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. అక్కడి నేత, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సరితాయాదవ్ నేటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తనకు తాను సచ్ఛీలుడినని చెప్పుకునే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తాను పార్టీ మారలేదని స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ, బాన్సువాడలో అక్కడి కాంగ్రెస్ సీనియర్ నేత బాలరాజు, పోచారంపై పోటీచేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్‌రెడ్డి పోచారాన్ని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని చేసిన డిమాండ్లను ఎవరూ దాచిపెట్టలేరు.
అక్కడ రగులుతున్న కాంగ్రెస్ క్యాడర్ పోచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అక్కడి సీనియర్ నేత, కడియంపై పోటీచేసి ఓడిపోయిన ఇందిర తీవ్రంగా వ్యతిరేకించారు. భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అక్కడి సీనియర్ నేత పొదెం వీరయ్య వ్యతిరేకించడం నిజం కాకుండా పోదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలను అడిగితే వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారా? లేదా? అన్నది చెప్తారు.
అది కాంగ్రెస్ కండువా కాదా?
ఫిరాయింపు ఎమ్మెల్యేలు విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించిన దీపాదాస్, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు తమ మెడలో కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, అది మూడు రంగుల జెండా మాత్రమేనని పచ్చి అబద్ధం చెప్తున్నారు. జాతీయ జెండాను ఎవరైనా మెడలో కప్పుతారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే తమను ఓటేసి గెలిపించిన ఓటర్లు, ప్రజలు, న్యాయవ్యవస్థ పట్టించుకోదన్న గుడ్డి నమ్మకంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తున్నది.
వారిని చేర్చుకున్నాం : పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది. పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నాం. మా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారు వచ్చి చేరుతామంటే చేర్చుకున్నాం’ అని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ టీవీ9 చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.