హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్భలం, ఆదేశాలతోనే బీఆర్ఎస్ సభ్యులపై కాంగ్రెస్ సభ్యులు బాటిళ్లతో దాడి చేసేందుకు యత్నించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ఓ పద్ధతి లేకుండా నడుస్తున్నాయని వివేకానంద ధ్వజమెత్తారు. శాసనసభ చరిత్రలోనే కొత్త సంప్రదాయాలకు రేవంత్ తెరలేపారని, రూల్స్‌కు వ్యతిరేకంగా, నిబంధనలను తుంగలో తొకి ఇష్టానుసారంగా సభను నడుపుతున్నారని చెప్పారు. ఆసెంబ్లీ సమావేశాలే నడపలేని వాళ్లు.. ఇక ప్రభుత్వాన్ని ఏం నడుపుతారని ప్రశ్నించారు. సీఎం అనుభవరాహిత్యంతో సమస్యలు వస్తున్నాయని, ఆయన తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. సభలో కుట్ర పూరితంగా తమ గొంతు నొకుతున్నారని, ప్రజాకోర్టులో రేవంత్‌ను దోషిగా నిలబెడతామని స్పష్టం చేశారు.
అన్ని వీడియోలు బయటపెట్టాలి: కౌశిక్‌రెడ్డి
అసెంబ్లీలో జరిగిన రాద్ధాంతంపై కావాలనే కొన్ని వీడియోలు మాత్రమే బయటపెట్టారని, తమ సభ్యులపై పేపర్లు విసిరి, అసభ్యంగా ప్రవర్తించి, చెప్పులు విసిరేందుకు కాంగ్రెస్ సభ్యులు యత్నించిన వీడియోలను సైతం బయటపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు.