Telangana | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయడంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేసిన పిటిషనర్ల ఫైళ్లను స్పీకర్ ముందుంచాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేయడం చెల్లదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట వాదించారు. స్పీకర్ ముందు ఫైళ్లు ఉంచాలనే ఆదేశాలను అమలు చేయాల్సిన అసెంబ్లీ కార్యదర్శికి ఆ తీర్పును సవాల్ చేసే అధికారం, స్థాయి లేదని చెప్పారు. ప్రజల డబ్బుతో విధులు నిర్వర్తిస్తున్న అధికారికి కోర్టు తీర్పును సవాలు చేసే అధికారం ఉండదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సింది స్పీకరేనని గుర్తుచేశారు. స్పీకర్ తన ముందున్న కోర్టు ఉత్తర్వులను అమలు చేయడమో, లేదో తేల్చుకోవాలని, కానీ, వాటిని అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిటిషన్ వేయగా, మరో ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేశారు.
అదేవిధంగా దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ శాసనసభలో బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపుల పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు వేర్వేరుగా దాఖలు చేసిన రెండు అప్పీల్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం కూడా విచారణ కొనసాగించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున గండ్ర మోహన్‌రావు వాదనలు కొనసాగిస్తూ.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లో ఫిరాయింపుదారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పేరొన్నారని చెప్పారు. ప్రజల డబ్బుతో జీతభత్యాలు తీసుకునే అధికారికి సంబంధం లేని పార్టీ ఫిరాయింపుల కేసులో అప్పీల్ దాఖలు చేసే అధికారం లేదని పేర్కొన్నారు. స్పీకర్ తన ముందున్న ఫిరాయింపు పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను వెల్లడించాలని మాత్రమే సింగిల్ జడ్జి ఆదేశించారని, ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ల వాదన చట్టబద్ధమేనని గండ్ర మోహన్‌రావు చెప్పారు. ‘కైశమ్ మేఘచంద్రసింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్’ కేసులో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఆ విధమైన ఉత్తర్వులు జారీచేశారని తెలిపారు. శాసనసభ కాలపరిమితి పూర్తయ్యే ఐదేండ్ల వరకు స్పీకర్ వేచిచూస్తూ ఉంటే, పిటిషనర్లు కోర్టుల ద్వారా న్యాయం ఆశించడం ఒకటే మిగిలిన మార్గమని వివరించారు. ‘కిహోటో హోలోహన్’ కేసును ప్రస్తావిస్తూ.. అనర్హత పిటిషన్లలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ నిరాకరిస్తే పిటిషనర్‌కు ఎటువంటి పరిషారం లభించదని చెప్పారు. కైశమ్ మేఘచంద్రసింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లను స్పీకర్ విచారణ పూర్తి చేసి నిర్దిష్ట సమయంలో తగిన నిర్ణయాన్ని వెలువరించాలని పేర్కొన్నారు. మూడు నెలల గడువులోగా స్పీకర్ తన ముందున్న పిటిషన్లను పరిషరించాలని చెప్పారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అవకాశం ఇవ్వలేదని, స్పీకర్ కార్యాలయం కూడా తమ పిటిషన్లు తీసుకోలేదని, వివరించారు.
రిజిస్టర్డ్ పోస్టులో పిటిషన్ పంపితే వాపస్ వచ్చిందని, చివరికి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. కోర్టు ఆదేశాల తర్వాత పిటిషన్లు స్పీకర్ వద్దకు చేరాయని, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం వద్దని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం బలోపేతంగా ఉండాలంటే, భావితరాలకు స్ఫూర్తిదాయంగా ఉండాలంటే, ప్రజలిచ్చిన తీర్పు అపహాస్యం కాకుండా ఉండాలంటే ఫిరాయింపులకు పాల్పడిన వాళ్లు ఒకరోజు కూడా ఎమ్మెల్యేలుగా కొనసాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. గతంలో స్పీకర్ అలా చేశారంటూ ఇప్పుడు చెప్పడం సమర్ధనీయం కాదని, గతంలో తప్పు జరిగిందని చెప్పి అదే తప్పును కొనసాగించేందుకు ఆసారం ఇవ్వొద్దని హైకోర్టును కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరైన దానం నాగేందర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారని, ఈ దశలో కూడా స్పీకర్ ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నిర్ణయించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలు విచారణార్హం కాదని గండ్రా వాదించారు. విచారణ షెడ్యూలును నిర్ణయించడానికి పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని కార్యదర్శికి ఆదేశాలున్నాయని, వీటిపై అప్పీలు దాఖలు చేసే అధికారం కార్యదర్శికి ఉండదని చెప్పారు. ఆ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ అని, అభ్యంతరాలు ఉంటే స్పీకర్ అప్పీలు దాఖలు చేయాలిగానీ కార్యదర్శి కాదని స్పష్టంచేశారు. అంతేగాకుండా అప్పీలు దాఖలు చేయడానికి స్పీకర్ ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని, అందువల్ల అప్పీలు విచారణార్హం కాదని, ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరారు. తొలుత సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, మయూర్‌రెడ్డి వాదించారు. వాదనలు శుక్రవారం కొనసాగనున్నాయి.
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో శాసనసభ స్పీకర్‌కు ఉత్తర్వులు జారీచేయాలని తాము కోరడం లేదని బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదించారు. శాసనసభ వ్యవహారాల సభకు అధిపతి హోదాలో పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ విచారణ చేయబోరని గుర్తుచేశారు. పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ట్రిబ్యునల్ అనేది న్యాయ వ్యవహారాల పరిధిలోకి వస్తుందని వివరించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్‌కి రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు/సుప్రీంకోర్టు ఆదేశాలు/ఉత్తర్వులు/తీర్పులు ఇవ్వొచ్చునని చెప్పారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విధులు నిర్వహించే స్పీకర్‌కు ఉత్తర్వులు ఇవ్వొచ్చునని, ఈ నేపథ్యంలో గతంలో సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గండ్ర ధర్మాసనం దృష్టికి తెచ్చారు.