హనుమకొండ, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్‌లో మంత్రి సురే ఖ.. ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ టీవీ సీరియల్లా కొనసాగుతున్నది. రెండు వర్గాలు పీసీసీ చీఫ్‌కు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీకి పలుమార్లు ఫిర్యాదులు చేసి, వివరణలు ఇచ్చినా పంచాయితీ సమసిపోవడం లేదు. మంత్రి సురేఖపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం, మంత్రి సురేఖ వెళ్లి ఎమ్మెల్యేలపై చెప్పడం.. ఇలా ఇప్పటికే పలుమార్లు జరిగిన వర్గపోరుకు కాంగ్రెస్ అధిష్ఠానం సైతం పుల్‌స్టాప్ పెట్టడం లేదు.
ఈ సారి ఎమ్మెల్యేలు కొద్దిగా బెట్టుచేస్తుండటంతో పీసీసీ నాయకత్వం వారిని పిలిచి మాట్లాడాలని నిర్ణయించింది. కొండా సురే ఖ, ఆమె భర్త మురళిపై ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై చర్చించేందుకు రావాలని ఎమ్మెల్యేలను ఆహ్వానించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు.. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు పీసీసీ క్రమశిక్షణ సంఘం నుంచి పిలుపువచ్చింది.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శుక్రవారం పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి వివరించారు. మిగిలిన ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఈఆర్ నాగరా జు, గండ్ర సత్యనారాయణరావు.. మల్లు రవిని కలిసి చర్చించారు. వివరంగా చర్చించేందుకు సోమవారం రావాలని మల్లు రవి వీరికి సూచించారు. సోమవారం జరిగే సమావేశం అనంతరం పీసీసీ క్రమశిక్షణ సంఘం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సహించేది లేదనివారు చెప్తున్నారు. కాగా కొండా సురేఖ సైతం సదరు ఎమ్మెల్యేలపై పలుమార్లు పీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.