Yennam Srinivas Reddy | హైదరాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగ, సంప్రదాయంపై మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ పండుగను కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశంపై శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో 70శాతం గ్రామాల్లో బతుకమ్మ ఆడరు. ఒకవేళ ఆడినా కూడా అగ్రకులాలకు చెందిన మహిళలకు మాత్రమే ఆడుతారు. దళిత, బహుజనులు బతుకమ్మ ఆడిన సందర్భాలు ఎప్పుడూ లేవు. బతుకమ్మ అనేది వరంగల్ ప్రాంతంలో ఎక్కువగా ఆడుతారు తప్ప మిగిలిన జిల్లాల్లో ఆడరు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణవాదులు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బతుకమ్మను కొన్ని వర్గాలకే పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.