రంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తేతెలంగాణ): ‘చేవెళ్ల ప్రమాదంపై మంత్రులు మాట్లాడిన్రు కదా.. ఇంకా నేనేంటి మాట్లాడేది! వాళ్లు చూసుకుంటారు. నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు. ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతుంటాయి… ప్రయాణికులు చనిపోతుంటారు. ఈ రోడ్డుపై ఇప్పటికై చాలామంది చనిపోయారు. అయినా చనిపోయిన వారంతా కర్నాటకకు చెందినవారే, మన ప్రాంతానికి చెందినవారు చనిపోలేదు కదా. ఇందులో నువ్వెందుకు ఫోన్ చేశావు.’ ఇవీ కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య చేసిన వ్యాఖ్యలు. ప్రమాదం జరిగిన తర్వాత.. ఈ విషయంపై స్పందించాలని కోరుతూ నియోజకవర్గానికి చెందిన లక్ష్మణ్‌కుమార్ అనే వ్యక్తి.. ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు.
అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేగా ప్రమాదంపై స్పందించాలని కోరాడు. ఇందుకు స్పందించిన కాలె యాదయ్య అసహనానికి గురయ్యాడు. ఫోన్ చేసిన వ్యక్తిపై మండిపడుతూ రుసరుసలాడారు. ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. చేవెళ్లలో ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి, ఒకప్లాట్ కొనుగోలు చేశానని, ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో చేవెళ్లలోని ప్లాట్ అమ్ముకుని, మేడ్చల్‌కు వెళ్లిపోయినట్టు లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. రోడ్డు విస్తరణ చేయించాలని కోరగా ఎమ్మెల్యే సమాధానం దాటవేశారని చెప్పారు.