Miss World Pagent | హైదరాబాద్ మే 10 (నమస్తేతెలంగాణ): ఆహ్లాదకర పరిస్థితుల్లో నిర్వహించాల్సిన అందాల పోటీలను యుద్ధ వాతావరణంలో నిర్వహించడం ఎందుకని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం భారత సైన్యం విరోచితంగా పోరాడుతున్న వేళ సీఎం రేవంత్‌రెడ్డి మిస్ యూనివర్స్ పోటీల సమీక్షలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. పాక్ దాడిలో నేలకొరిగిన మురళీనాయక్‌కు బీఆర్ఎస్ తరఫున శనివారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కురువ విజయ్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
సైన్యానికి సంఘీభావంగా దేశప్రజలంతా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రంలోని పౌరుల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంతో ఐపీఎల్ టోర్నీని వాయిదా వేశారని, కగార్ ఆపరేషన్‌ను నిలిపివేసిన ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీల షెడ్యూల్‌ను ప్రకటించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
విమానాశ్రయాలు, పోర్టులను మూసివేయడంతో ధరలు పెరిగే అవకాశం ఉన్నదని ప్రజలు ఆందోళన చెందుతుంటే భరోసా ఇవ్వాల్సిన సీఎం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో ఉన్న తెలంగాణవాసులు ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ రాష్ర్టానికి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని, ఆపదలో ఉన్నవారిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు.
ధాన్యం కొనేవారు లేక అల్లాడుతున్న అన్నదాతలను పట్టించుకొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం, మంత్రులు అందాల పోటీల వెంట వెంపర్లాడుతూ రాష్ట్రం పరువును గంగలో కలుపుతున్నారని నిప్పులు చెరిగారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేల్ వాయించిన చందంగా దేశంలో యుద్ధ వాతావరణం ఉన్నా.. సీఎం రేవంత్ అందాల పోటీలపై శ్రద్ధ చూపడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా మిస్‌వరల్డ్ పోటీల నిర్వహణపై పునరా లోచించాలని డిమాండ్ చేశారు.