హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కంపెనీని ఈస్ట్ ఇండియాతో పోల్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే సంస్థకు మూసీ, కొడంగల్, కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు తహతహలాడడంలో మర్మమేంటి? సుంకిశాల ఘటనకు కారణమైన ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంలేదేందుకని కేటీఆర్ డిమాండ్ చేసినా పెడచెవిన పెడుతున్నరెందుకు? ఆ ప్రాజెక్టు కూలిపోయి వందల కోట్ల నష్టం జరిగినా చర్యలు తీసుకోవడంలో తాత్సారమెందుకు? ఎందుకు లాలూచీ పడుతున్నరు? అంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడె రాజీవ్‌సాగర్, బీఆర్ఎస్ నేత రఘువీర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి అంత భయం ఎందుకని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ‘ఢిల్లీలోని మీ పార్టీ అధిష్ఠానానికి డబ్బుల మూటలు పంపించేందుకే ఆ కంపెనీ ఎండీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నరా?’ అని సూటిగా ప్రశ్నించారు. మేఘా కంపెనీ ఏజెన్సీ చేపట్టిన నిర్మాణ లోపాలతోనే సుంకిశాల కూలిపోయిందని హెచ్ఎండీఏ నివేదించినా చర్యలెందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ అవినీతి వ్యవహారాన్ని బీఆర్ఎస్ ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోదని తేల్చిచెప్పారు. న్యాయపరంగా, ప్రజాక్షేత్రంలో పోరాడుతుందని హెచ్చరించారు. దేశంలో ఏ రా ష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే డబ్బు సంచులు తరలిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పదకొండు నెలల పాలనలో అన్ని రంగాలను సర్వనాశనం చేశారని కేపీ వివేకానంద దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై కక్షలు, కుట్రలు తప్ప సాధించేందేమీలేదని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరిట బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారని విమర్శించారు. ఆర్ఆర్ (రాహుల్, రేవంత్)ట్యాక్స్‌తో రాష్ట్ర ప్రజలను పీల్చుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీ, మోదీని డబుల్ ఇంజిన్ సర్కారు అని రాహుల్‌గాంధీ దుయ్యబడుతుంటే, ఇక్కడేమో రేవంత్‌రెడ్డి అదే అదానీకి కాంట్రాక్టులు కట్టబెట్టి ప్రధాని మోదీకి దగ్గరయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో సంజయ్, రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్‌గా సహకరించుకుంటున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని విమర్శించారు.
ప్రజల ఆస్తులు గుంజుకునేందుకు కులగణన పేరిట అసంబద్ధ సర్వే నిర్వహిస్తున్నదని వివేకానంద ఆరోపించారు. నాడు సమగ్ర కు టుంబ సర్వేను వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి ఇ ప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వేపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అసెంబ్లీని స మావేశపరిచి చర్చించాలని డిమాండ్ చేశారు.
రేవంత్ సర్కారును కాపాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తహతహలాడుతున్నారని ఎస్సీ,ఎస్టీ కమిష న్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, బండి సంజ య్ ముగ్గురు కలిసి రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రె స్ ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎ ద్దేవా చేశారు. మోదీ ఫొటో పెట్టుకొని రెండుసార్లు ఎంపీగా గెలిచి పొరపాటున కేంద్రమంత్రి అయిన సంజయ్ కనీస పరిజ్ఞానం లేకుండా బీఆర్ఎస్పై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పా లనలో అవినితి జరిగిందంటూ 11 నెలల్లో 33 ఎంక్వయిరీలు వేసి ఏం తేల్చారని ప్ర శ్నించారు.
అటు ఢిల్లీలో ఇటు గల్లీలో వారి ప్రభుత్వాలే ఉన్నా బీఆర్ఎస్ అక్రమాలకు వెలికితీయలేదెందుకని నిలదీశారు. సంజ య్, రేవంత్ చీకట్లో చేతులు కలిపి కేసీఆర్, కేటీఆర్‌ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వారి బెదిరింపులకు భయపడబోమని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్సోళ్లకు మిత్తితో సహా చెల్లిస్తామ ని హెచ్చరించారు. ఈ బాంబులు, ఆ బాం బులంటూ ఎగసెగసి పడుతున్న పొంగులేటికి రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరేననే విష యం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.