బాన్సువాడ, జూన్ 28: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు ‘రేవంత్ రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి‘ అనే నినాదం మార్మోగుతున్నదని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆదివారం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సమావేశం నిర్వహించగా వేముల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మోసపు మాటలు చెప్పడం ఆపి, ప్రతి మహిళకూ ఇప్పటివరకు బాకీ పడిన రూ.75 వేలు, 3 లక్షల మంది ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకునే ఏకైక శక్తి బీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. రెండున్నరేండ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న ప్రతి కార్యకర్తకూ త్వరలోనే డిజిటల్ గుర్తింపు కార్డులను అందజేయనున్నట్టు తెలిపారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవరూ చేయలేదని, కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం పార్లమెంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చినా సభలో ఉన్న రాష్ర్టానికి చెందిన 8మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మోదీ, చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్ పనిచేస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసం కేసీఆర్‌ను మోసంచేసిన పోచారం శ్రీనివాసరెడ్డికి కాలమే తగిన బుద్ధి చెబుతుందని అన్నారు. బాన్సువాడలో చాలా మంది నాయకులు, ఉద్యమకారులు తిరిగి పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, పోచారానికి మళ్లీ గేట్లు తెరుస్తారేమో అన్న ఆందోళన వారిలో ఉందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పోచారాన్ని తిరిగి బీఆర్ఎస్లోకి తీసుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ చెప్పినట్లు కార్యకర్తలకు వివరించారు.