బోధన్, జనవరి 19: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని, అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ జెండాను తాకే దమ్ము ఉన్నదా? అని ప్రశ్నించారు. అనేక హామీలిచ్చి వంచించిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో వేముల మాట్లాడారు. దోచుకోవటం, దాచుకోవటం కాంగ్రెస్ రీతిగా మారిందని అన్నారు. మంత్రుల మధ్య పంపకాల పంచాయితీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సివిల్ సప్లయీస్, బొగ్గు, లిక్కర్ కుంభకోణాల్లో మంత్రులు, సీఎం వాటాల కోసం కొట్టుకుంటున్నారని తెలిపారు.
ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా రేవంత్‌రెడ్డి సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. బోధన్ మున్సిపాలిటీపై మూడోసారి గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బోధన్ అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరించిందని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ రాగానే ఇక్కడి ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టు ఆరోపించారు. తనతోపాటు తన కుమారుడిపై అక్రమంగా కేసులు పెట్టించాడని ఆరోపించారు. సుదర్శన్‌రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసును ఉసిగొల్పుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎందుకు అమలుచేయలేదని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆయేషా ఫాతిమా, రవీందర్ యాదవ్, గిర్దావర్ గంగారెడ్డి పాల్గొన్నారు.