మోర్తాడ్, ఆగస్టు 2: ప్రజలను మరోసారి మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడంలేదని.. డిక్లరేషన్ల పేరిట ఢిల్లీ నుంచి రోజుకో నేతను రప్పించి.. వారితో హామీలు ఇప్పించారని గుర్తుచేశారు. అప్పుడు ప్రజలను మొదటిసారి మోసం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ప్రశాంత్‌రెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రేవంత్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పేరు చెప్పుకొని ఓట్లడిగే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. అందుకే మీనాక్షి నటరాజన్ అనే కొత్త ముఖాన్ని ముందు పెట్టి.. పాదయాత్ర పేరుతో ప్రజల్ని రెండోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నది’ అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజలకు చెప్పిన గ్యారంటీల్లో ఏ ఒక్కటైనా సక్రమంగా అమలయిందా? అని ప్రశ్నించారు.
వాళ్ల మాటలకే దిక్కులేదు!
వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభకు రాహుల్‌గాంధీ వచ్చారని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15వేల రైతుభరోసా, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్, పసుపు పంటకు రూ.12 వేల మద్దతు ధర ఇస్తామని చెప్పారని ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. యూత్ డిక్లరేషన్ సభకు ప్రియాంకగాంధీ వచ్చి హామీలు ఇచ్చారని తెలిపారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు 4 వేల భృతి, విద్యార్థినులకు స్కూటీలు, 5 లక్షల విద్యాభరోసా కార్డులు ఇస్తామన్నారని, అందులో ఏ ఒక్కటన్నా అమలు చేశారా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీలకే దిక్కులేదని, మీనాక్షి మాటలను ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లు, మ్యానిఫెస్టో, ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై మీనాక్షి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.