హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): పసుపుబోర్డు ఏర్పాటైనప్పటికీ రాష్ట్రంలోని పసుపు రైతులకు అన్యాయమే జరుగుతున్నదని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బోర్డు రాకముందు క్వింటా పసుపు రూ.16 వేల వరకు ధర ఉండగా, ఈ సీజన్లో క్వింటాకు రూ.8 నుంచి రూ.9 వేలే పలుకుతున్నదని మండిపడ్డారు. ఖరీదుదారులు సిండికేటుగా మారి రైతులకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం శాసనససభ సమావేశాల్లో జీరో అవర్‌లో భాగంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు.
‘ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, జగిత్యాల, నిర్మల్, ముధోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పసుపు రైతులు నిజామాబాద్ మార్కెట్లోనే తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు. క్వింటాకు రూ.8 నుంచి రూ.9 వేలే పలుకుతుంది. ఇదే పసుపు మహారాష్ట్ర సాంగ్లి మార్కెట్లో రూ.13 నుంచి రూ.14 వేల ధర వస్తున్నది. దళారులు, ఖరీదుదారులు కుమ్మక్కై రైతుల నుంచి తక్కువ రేటుకు కొంటున్నరు. పసుపు బోర్డు వచ్చినంక మద్దతు లభిస్తుందని, మాకు న్యాయం జరుగుతుందని రైతులు భావించారు. కానీ, సగానికి రేటు పడిపోయింది. ఖరీదుదారుల సిండికేట్ కుట్రలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సాంగ్లి మార్కెట్ తరహాలో ధర వచ్చేలా చొరవచూపాలి. రూ.13 వేలకు ఎంత తగ్గినా, కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకారం ఆ తగ్గిన నగదును రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి’ అని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
పవిత్రమైన గోదావరిలో సీవరేజీ నీళ్లు కలవకుండా చర్యలు తీసుకోవాలని, దీనికోసం నిధులు కేటాయించాలని ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ జీరోఅవర్‌లో ఆయన మాట్లాడుతూ బాసర, ధర్మపురి లక్ష్మీనరసింహాస్వామి ఆలయాలు ఉన్న గోదావరి తీరాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. పదేండ్లలో సీఎం కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు చేశారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రులు సైతం వచ్చి గంగాహారతి ఇచ్చారని తెలిపారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయని, ఇందుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నదని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. గడిచిన 15 నెలల్లో 84 ప్రశ్నలు అడిగితే ఎనిమిది ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారని, మిగతా వాటిపై ఎలాంటి జవాబు ఇవ్వలేదని మండిపడ్డారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద 86 ప్రశ్నలు అడిగితే 9 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన సమాధానాలు కూడా సంపూర్ణంగా లేవని చెప్పారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఎవరిది? అని ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకే సమాధానం ఇవ్వలేకపోతే, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని నిలదీశారు. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేను గుర్తించకుండా ఇన్చార్జి మంత్రి పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు.
పటాన్చెరు సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న డంప్‌యార్డ్‌ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ జీఆరో అవర్‌లో ఆమె మాట్లాడుతూ 3 మండలాలపై తీవ్ర ప్రభావం చూపనున్న ఈ డంప్‌యార్డును పోలీసుల పహారాలో ప్రజలను నిర్బంధించి ఏర్పాటు చేయాలని చూడటం తగదని హితవు పలికారు. 47 రోజులుగా రైతులు నిరాహార దీక్షలు చేస్తుంటే, 144 సెక్షన్ విధించి అదే రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కూరగాయలు పండించుకొనే రైతుల భూములు, చెరువు కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పారు. డంప్‌యార్డ్ నిలిపివేత కోరుతూ రైతులు కోర్టుకు వెళ్లారని, కోర్టు సైతం సానుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. తక్షణమే డంప్‌యార్డు పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.