మోర్తాడ్, అక్టోబర్ 10: కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు రేవంత్‌రెడ్డి ఇస్తామన్న తులం బంగారం ఏమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్, మెండోరా, ఏర్గట్లలో గురువారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహిళలు తులం బంగారం కోసం నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దగ్గరకు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘చాక్లెట్ ఇస్తా సప్పరియ్యుండ్రి అన్నట్టు జేసిండ్రు కాంగ్రెసోళ్లు. ఎన్నికలప్పుడు కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తమన్నరు. ఏది? ’ అని మహిళలు వాపోయారు. ‘మాటిచ్చినప్పుడు మాట తప్పద్దు. మాకూ తులం బంగారం ఇయ్యాలె’ అని అన్నారు.
దీంతో స్పందించిన వేముల.. ఆడబిడ్డల పక్షాన మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని, మీ తరపున తులం బంగారం కోసం అసెంబ్లీలో కొట్లాడుతానని ఎమ్మెల్యే మహిళలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఎగ్గొట్టిన తీరుపై ప్రశాంత్‌రెడ్డి వివరిస్తుండగా, కాంగ్రెస్ నేతలు అడ్డు తగిలారు. ఈ క్రమంలో వాగ్వాదం జరుగడంతో పోలీసులు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు తీసుకెళ్లారు.