నర్సాపూర్,ఏప్రిల్ 14. అంగన్వాడీలకు ఫోన్ల పంపిణీలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తే విచారణ చేయాల్సిందిపోయి తెలంగాణ తొలి సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్‌కు లీగల్ నోటీసులు ఇవ్వడం ఏమిటని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లకు 5జీ ఫోన్లు ఇస్తున్నామని చెప్పి.. 4 జీ ఫోన్లు పంపిణీ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ ఆధారాలతోపాటు చూపిస్తే , మంత్రి సీతక్క చెప్పు తెగుతుందని అనడం ఏ సంస్కారం అని ప్రశ్నించారు. ఈ-కార్ రేస్, కాళేశ్వరం, ఫోన్‌ట్యాపింగ్‌లో అవినీతి జరిగిందని కోర్టుకెళ్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది మరిచారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటివారే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసహనంతో ఉన్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్ల్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ను చూపి కండలు తిరిగినవాడని చెప్పడం, ఆయన బయట నరికేస్తానని అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.