భద్రాచలం, అక్టోబర్ 7 : కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సోమవారం భద్రాచలంలోని ఓ సత్రంలో జరిగిన పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యతో కలిసి ప్రత్యక్షమవడం తీవ్ర చర్చకు దారితీసింది. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీచేసే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, ఎంపికకు సంబంధించి నాయకులతో సైతం ఎమ్మెల్యే చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలు కావడం, సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తుది విచారణ గడువు సమీపిస్తుండడంతో వెంకట్రావుకు ఏ పార్టీ వైపు మాట్లాడితే ఏ సమస్య వస్తుందోనని.. కొన్నిచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ, సన్నిహితులతో కలిసి కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో తెల్లం తీరుపై సామాజిక మాధ్యమాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూనే.. కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమావేశాల్లో పాల్గొనడంపై ‘ఓటర్లు సైతం ఎమ్మెల్యే గారు.. మీరు ఏ పార్టీలో ఉన్నారో మాకు చెప్పిన తర్వాతే ఎన్నికల ప్రచారం చేసుకోండి’ అంటూ పోస్టులు పెట్టడం, కొన్ని రాజకీయ పార్టీలు సైతం ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ‘ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా.. సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన నిర్ణయం తీసుకుంటారు.. గోడ దూకే ఎమ్మెల్యే మనకెందుకు.. ఎమ్మెల్యేనే ఆత్మ విమర్శ చేసుకొని రాజీనామా చేస్తే మంచిది..’ అంటూ పలు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. సోమవారం జరిగిన సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి నాగ సీతారాములు, నాయకులు బుడగం శ్రీనివాస్, సరెళ్ల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
చర్ల, అక్టోబర్ 7 : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇసుక ర్యాంపు నిర్వాహకులను బెదిరించడం.. అక్రమ వసూళ్లకు పాల్పడడం.. డబ్బులు ఇవ్వని వారిపై దాడులకు తెగబడడం నిత్యకృత్యమైంది. చర్ల మండలం తేగడ ఇసుక ర్యాంపు నిర్వాహకులను ఎమ్మెల్యే అనుచరుడు నవాబ్ మంగళవారం తన అనుచరులతో వచ్చి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో ర్యాంపు నిర్వాహకుడు, కాంగ్రెస్ నాయకుడు కాపుల నాగరాజు, నవాబ్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో నవాబ్ తన అనుచరులతో కలిసి నాగరాజును కొట్టాడు. దీంతో నాగరాజు.. నవాబ్తో పాటు అతడి అనుచరులపై చర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడి ఘటన చర్చనీయాంశం కావడంతో సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.