హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం గోదావరి పుషరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, రాష్ట్రానికి ఒక రూపాయి కూడా సాధించలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణకు హకుగా రావాల్సిన నిధుల కోసం పోరాటంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఉండి ఉంటే, తెలంగాణకు అన్యాయం జరిగేది కాదన్నారు.
కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు సున్నా కేటాయింపులు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం అదనపు గ్రాంట్ కింద రూ.15వేల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని తమకు బాధ లేదని, తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నదే తమ ఆవేదన అని తెలిపారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణకు మొండి చెయ్యే చూపుతున్నదని విమర్శించారు. తెలంగాణ పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హకుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.