కొల్చారం, జూన్ 19: మెదక్ జిల్లా కొల్చారంలో బుధవారం మంత్రి కొండా సురేఖ పాల్గొన్న బడిబాట కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీపై స్థానిక ప్రజాప్రతినిధులకు స్థానం కల్పించకుండా కాంగ్రెస్ నాయకులను కూర్చోబెట్టడం ఏమిటని అధికారులను నిలదీశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ మొదలై తోపులాటకు దారితీసింది.
ఎమ్మెల్యే సునీతారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి ఇరుపార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా గొడవకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో బడిబాట ముగింపు సభ పూర్తి కాకుండానే అతిథులు మధ్యలోనే వెళ్ల్లిపోయారు.
పదవులు లేనివారి పెత్తనమేమిటి ?: ఎమ్మెల్యే
అధికారిక కార్యక్రమాల్లో పదవులులేని కాంగ్రెస్ నాయకుల పెత్తనమేమిటని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రశ్నించారు. కొల్చారం ఎంపీపీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవంలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గుమ్మడికాయ కొట్టడంపై సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేను కాదని ఓడిపోయిన అభ్యర్థితో మంత్రి కొండాసురేఖ ఎలా రిబ్బన్ కట్ చేయించారని ప్రశ్నించారు. అలాగే ఎంపీపీ మంజుల తన చాంబర్లో రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే సునీతారెడ్డి, జడ్పీటీసీ మేఘమాల సంతోష్‌కుమార్‌ను కాదని మంత్రి కొండాసురేఖతో కాంగ్రెస్ నాయకులు వెళ్లిపోయారు. దీంతో ఎంపీపీ నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రెడ్డిపల్లి ఆంజనేయులు, రవీందర్‌రెడ్డి ఆమెకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.