కౌడిపల్లి, సెప్టెంబర్11: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కౌడిపల్లి బస్టాండ్ వద్ద మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిపై లోవోల్టేజీ, యూరియా, సాగునీరు, సన్నవడ్లకు బోనస్ తదితర సమస్యలపై వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ధర్నాచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలను పిలువకుండా ఓడిపోయిన ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. కౌడిపల్లి సబ్‌స్టేషన్‌లో ఉన్న 50ఎంవీఏ బూస్టర్‌ను సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు తరలించి ఇక్కడ 10/16ఎంవీఏను పెట్టడంతో లోవోల్టేజీ సమస్యతో బోరుమోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు.
రైతులకు జీలుగ, యూరియా, డీఏపీ పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యాసంగిలో జిల్లాలో రైతులు పండించిన సన్నవడ్లకు బోనస్ రూ.32 కోట్లు బకాయి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా వద్దకు చేరుకున్న మెదక్ ట్రాన్స్‌కో డీఈ చాంద్‌పాషా, డీఈ వేదకుమార్, నర్సాపూర్ ఏడీ రమణారెడ్డి, ఏఈలకు కౌడిపల్లిలో వెంటనే 50ఎంవీఏ బూస్టర్‌ను బిగించాలని వినతిపత్రం అందజేశారు. వారం రోజుల్లో సమస్యను పరిస్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.