మన్సూరాబాద్, సెప్టెంబర్ 29 : మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్నవారు ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని, ఇక్కడ బుల్డోజర్లు పెట్టాలంటే తమను దాటి రావాలని.. తాను బతికున్నంత వరకు ఎవరి ఇంటిని కూల్చనివ్వనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో మూసీ పరీవాహక ప్రాంతమైన ఫణిగిరికాలనీలో బాధితులను ఆయన ఆదివారం కలిసి మాట్లాడి ధైర్యాన్నిచ్చారు. మార్కింగ్‌లు చేసినంత మాత్రాన ఎవరి ఇండ్లను కూల్చలేరని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా ప్రజలను కలువలేకపోయినట్టు తెలిపారు. అభివృద్ధి పేరుతో వేలాది మందిని నిరాశ్రయులను చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నివాసితులకు అన్యాయం జరగకుండా మూసీని అభివృద్ధి చేయాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని గుర్తుచేశారు. ప్రజల ఇండ్లకు ఎలాంటి నష్టం జరకుండా చూసేందుకే తనను ఎంఆర్డీసీ చైర్మన్‌గా నియమించారని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్న కేసీఆర్, నది పరీవాహక ప్రాంతంలో 32 సీవరేజ్ ట్రీట్మెంటు ప్లాంట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. నాగోల్‌లో రూ.400 కోట్లతో ఎస్టీపీని నిర్మించామని చెప్పారు. మరో ఎనిమిది ప్లాంట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ అభివృద్ధి పేరిట వేలాది మంది జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. చట్టబద్ధంగా స్థలాలు కొని రిజిస్ట్రేషన్లు చేయించుకొని, బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకున్నారని, రెండు కోట్లతో కట్టిన ఇంటికి 30లక్షల పరిహారం ఇస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. 2013లో కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం ఎవరి నుంచైనా భూములు, ఇండ్లు స్వాధీనం చేసుకోవాలంటే మూడు వంతుల నష్ట పరిహారం చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మూసీ పరీవాహక ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. పేదల ఇండ్లను కాపాడేందుకు అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వచ్చిన సమయంలో స్థానికంగా ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. కొన్నేండ్ల కింద కట్టుకున్న తమ ఇండ్లను కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రలకు అడ్డుకోవాలని ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఊర్లల్లో వ్యవసాయ భూములను అమ్ముకుని వచ్చి ఫణిగిరికాలనీ, న్యూమారుతీనగర్ నార్త్ కాలనీ, సత్యానగర్, వినాయక్‌నగర్, భవానీనగర్ కాలనీల్లో ఇండ్లు కట్టుకున్నామని తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్నామని, పన్నులు కడుతున్నామని, బ్యాంకు లోన్లు ఉన్నాయని చెప్పారు. ఎప్పుడో 25 ఏండ్ల క్రితం కట్టుకున్న ఇండ్లు ఇప్పుడు మూసీ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నాయని మార్కింగ్ చేసి వెళ్లడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. మార్పు.. మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా? అని ప్రశ్నించారు. ‘మమ్మల్ని చంపి మా శవాల మీదినుంచి బుల్డోజర్లను తీస్కపోవాలె తప్ప మా ఇండ్లను కూల్చనిచ్చే ప్రసక్తేలేదు’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవడం కష్టంగా ఉన్నదని, ఎమ్మెల్యే చొరవ చూసి స్టే తెచ్చి తమను కాపాడాలని వేడుకునాన్నారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డబ్బులు కావాలంటే తామంతా జోలె పట్టి తిరిగి విరాళాలు జమచేసి ఇస్తామని, తమ ఇండ్ల జోలికి మాత్రం రావద్దని వేడుకున్నారు. నాలుగైదు రోజులుగా నిద్రాహారాలు మాని ఇండ్లను రక్షించుకునేందుకు జాగారం చేస్తున్నామని, రాత్రి వేళల్లో ఏ వాహనం వచ్చినా భయమవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.