బోధన్, జనవరి 4:నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామన్న ప్రభుత్వం.. ఆ బాధ్యతను రైతులపైకి నెట్టేసింది. 10 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేస్తేనే ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యమని తేల్చి చెప్పింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన చెరుకు రైతుల సదస్సులో బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీని తెరిపించాలంటే ముందుగా విస్తారంగా చెరుకు పండించాల్సి ఉంటుందని చెప్పడం ద్వారా పరోక్షంగా ఫ్యాక్టరీ పునరుద్ధరణ బాధ్యతను రైతులపైకి నెట్టేశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని, రైతులు వరి పంటకు బదులుగా చెరుకును పండిస్తే లాభం వస్తుందని చెప్పారు. ఈ ఏడాది చెరుకు విత్తనం పంటను 300 నుంచి 400 ఎకరాల్లో వేసే విషయాన్ని రైతులు పరిశీలించాలని సూచించారు.
వచ్చే సీజన్లో చెరుకు పంటను విస్తారంగా వేస్తే, క్రషింగ్ కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి యంత్రాలకు మరమ్మతులు చేసి అదే ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ చేస్తామని చెప్పారు. చక్కెర రికవరీ తక్కువగా వస్తే, కొత్త ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తామని, అవసరమైతే ఫ్యాక్టరీని తరలిస్తామనడంపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. చెరుకు పండించాలని నేతలందరూ చెప్పినా, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై స్పష్టత ఇవ్వలేదు.
దీంతో ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రభుత్వ ఆలోచన వేరే విధంగా ఉందన్న ప్రచారం జరుగుతున్నది. నిజాం షుగర్స్ పునరుద్ధరణ చేయలేమన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు రైతులు చెరుకు పండించలేదు కాబట్టే ఫ్యాక్టరీని తెరవలేదంటూ చేతులు దులుపుకునే ప్రయ త్నం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నా రు. సదస్సుకు అధికార పార్టీకి చెందిన వారిని మాత్రమే ఆహ్వానించి, మిగతా రైతులను పట్టించుకోకపోవడం, చెరుకు రైతు సంఘాల నాయకులను పిలవకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చెరుకు రైతుల సదస్సులో రైతుల కంటే అధికార పార్టీ నాయకుల హడావుడే ఎక్కువగా కనిపించడం విశేషం.