కోరుట్ల, జనవరి 13: యువత రాజకీయాల్లో చేరి తనదైన పాత్ర పోషించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 24 వ వార్డు బీఆర్ఎస్ నాయకులు నీలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన నిరూపించిందని పేర్కొన్నారు.
పదేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గర్జించిన యువత మళ్లీ అదే జోష్ తో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎందరో త్యాగదనుల ఉద్యమ ఫలితంగా 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన స్వప్నం సహకారమైందన్నారు. పాతకాలపు రాజకీయ వ్యవస్థకు చరమగీతం పాడుతూ యువత సరికొత్త ఉత్సాహంతో రాజకీయాల వైపు అడుగులు వేయాలని తెలిపారు. మన ప్రాంతం అభివృద్ధి పథంలో సాగాలంటే రాజకీయాల్లో మార్పు రావాలని కొత్త తరం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
యువకులు రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత కొత్త ఆలోచనలు, సంకల్పంతో రాజకీయాల్లో మెరుగైన పాత్ర పోషించాలని, తన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి గుడ్ల మనోహర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారీశెట్టి రాజేష్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు పహీం, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అతీక్, నాయకులు గడ్డం మధు, పేర్ల సత్యం, చిత్తరి ఆనంద్, ఎక్కల దేవి నవీన్, జాల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.