కోరుట్ల, డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి స్వరాష్ట్ర కలను సాకారం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణను ప్రకటించిన రోజైన డిసెంబర్ 9ని పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో మంగళవారం విజయ్ దివస్ వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన ఉద్యమాల త్యాగ ఫలమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను అన్ని రంగాలలో ముందుంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని కొనియాడారు. ఆయన ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అతీక్, బీఆర్ఎస్ నాయకులు బట్టు సునీల్, పొట్ట సురేందర్, ములుమూరి మురళి, జాల వినోద్ కుమార్, భూపెళ్లి నగేష్, గెల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.