కోరుట్ల, జూన్ 10 : ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ దవాఖానలో బుధవారం నిర్వహించిన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే అధ్యక్షుడి హోదాలో పాల్గొన్నారు. దవాఖానలో రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, సకాలంలో వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. వంద పడకల దవాఖానను బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో బ్రహ్మాండంగా నిర్మించుకున్నామని, ప్రస్తుతం దవాఖానలో వైద్య సిబ్బంది కొరత, వైద్య పరికరాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకొన్న ఫలితం లేకుండా పోయిందన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కోరుట్ల వంద పడకల దవాఖానకు మహర్దశ రానుందని అశాభావం వ్యక్తం చేశారు. కాగా హాస్పిటల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని గ్రౌండ్ వాటర్ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని సూపరిండెంట్ సునీత రాణి ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. బుధవారం వారసంత కారణంగా రహదారుల ఆక్రమణతో ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే ఎమర్జన్సీ వాహనాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యేకు వివరించారు.
స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర దృష్టికి సమస్యలను తీసుకు వెళ్లారు. ఇతర సమస్యలపై కూడ దృష్టి సారించి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత, డీడీవో లక్ష్మీ, ఆర్ఎంవో వినోద్ కుమార్, నర్సింగ్ సూపరిండెంట్లు సరళ, లలితరాణి, ఏవో కుతుబోద్దీన్, ఫార్మసీ ఆఫీసర్ ఉదయకుమార్, కౌన్సిలర్లు వసీం, పొట్ట సురేందర్, మోసీన్ తదితరులు పాల్గొన్నారు.