తాండూరు రూరల్, నవంబరు 12 : చేవెళ్లలో బస్సు- టిప్పర్ ఢీ కొన్న ఘటలో మృత్యువాతపడ్డ కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. బుధవారం వికారాబాద్‌జిల్లా తాండూరు మండలం, కోటబాసుపల్లిలో సబితాఇంద్రారెడ్డి తన సోదరుడు నర్సింహారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ ప్రమాదంలో టిప్పర్ ఎటు పోయిందని ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై క్లూ దొరికితే ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సమంజసంకాదని, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బస్సు – టిప్పర్ ప్రమాదంలో తాండూరులో ముగ్గురు అక్కా చెల్లెలతోపాటు 13 మంది మృతి చెందడం కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. టిప్పర్ డ్రైవర్‌కు రోజుకు నాలుగు ట్రిప్పులు కంకర తరలిస్తే గిఫ్టు ఇస్తామని యజమాని ఆశ చూపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని ఆరోపించారు. ఈ కంకర ఎవరి వద్దకు తీసుకెళుతున్నారనేది బహిర్గతం కావాల్సి ఉందని తెలిపారు. మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జాతీయ రోడ్డు కోసం తాను మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని గుర్తుచేశారు. ప్రస్తుత ఎంపీ కొండా విశ్వశ్వర్‌రెడ్డి జాతీయ రహదారి వంకర టింకరగా ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు.